AP POLITICS: రాజకీయాల్లో సెంటిమెంట్ అనేది ఎంత బలమైన ఆయుధమో, దాన్ని తమకు అనుకూలంగా వాడుకోవడంలో నాయకుల ద్వంద్వ నీతి కూడా అంతే విచిత్రంగా ఉంటుంది. తెలంగాణ సమాజం, ఆత్మగౌరవం అనే పదాలను సందర్భాన్ని బట్టి కొందరు రాజకీయ నేతలు, విశ్లేషకులు ఎలా మార్చేస్తారో చెప్పడానికి తాజాగా హైదరాబాద్ శివార్లలో వెలుగుచూసిన ఓ భూ కుంభకోణం, దానికి సంబంధించి సాగుతున్న నిశ్శబ్దమే దానికి నిదర్శనం.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నకిలీ పత్రాలు, ఫోర్జరీ జీవోలతో తెలంగాణకు చెందిన అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై సైబరాబాద్ పోలీసులు ఆయనను తమిళనాడులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో పోలీసులు తమ పని తాము చేసుకుపోయారు. కానీ, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నిత్యం తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడే రాజకీయ శక్తులు, కొందరు సీనియర్ జర్నలిస్టుల నుంచి దీనిపై కనీస స్పందన కరువైంది.

AP POLITICS: ఆంధ్రాకు చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయం
కొద్దిరోజుల క్రితం ఆంధ్రాకు చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయం చేస్తానని, హైదరాబాద్‌లో సభ పెడతానని ప్రకటించినప్పుడు ఇక్కడి రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రాంతీయ సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తూ.. పవన్ కళ్యాణ్‌ను తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. ఆయన అసలు హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతారో చూస్తామంటూ కొందరు హెచ్చరికలు జారీ చేశారు.
చివరకు వ్యక్తిగత ఆస్తులపైకి కెమెరాలు పంపి, ఆధారాలు లేకపోయినా పవన్ చెరువును కబ్జా చేసి ఫామ్‌హౌస్ కట్టారంటూ గంటల కొద్దీ డిబేట్లు నడిపారు. రాజకీయ విమర్శలను ప్రశ్నించినందుకు, దాన్ని మొత్తం తెలంగాణ సమాజంపై దాడిగా కలరింగ్ ఇచ్చారు. అప్పట్లో జనసేన, టీడీపీల విస్తరణను అడ్డుకోవడానికి ప్రాంతీయవాదాన్ని ఒక కవచంగా వాడుకున్నారు.
కానీ నేడు, సాక్షాత్తూ తెలంగాణ పోలీస్ శాఖే అధికారికంగా విచారించి, ఒక ఆంధ్రా ప్రాంత వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ భూమిని నకిలీ జీవోలతో దోచుకోవడానికి ప్రయత్నించాడని తేల్చినా.. నాటి సెంటిమెంట్ గళాలు నేడు మూగబోయాయి. తెలంగాణ ఏర్పాటును బహిరంగంగా వ్యతిరేకించిన పార్టీకి చెందిన నాయకుడు, ఇక్కడి సంపదను కొల్లగొడుతుంటే ఈ మౌన పాత్ర దేనికి సంకేతం?
ఆంధ్రా నాయకులు ఇక్కడ కేవలం రాజకీయం చేయడానికి వస్తేనే ప్రాంతీయవాదం గుర్తుకొస్తుందా? అదే ఆంధ్రా నేతలు ఇక్కడి విలువైన ప్రభుత్వ భూములను నకిలీ పత్రాలతో దోచేస్తుంటే ఆ సెంటిమెంట్ ఎక్కడికి పోతుంది? ఈ ద్వంద్వ వైఖరిని చూస్తుంటే.. కొందరికి తెలంగాణ ప్రయోజనాల కంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఉన్న అంతర్గత రాజకీయ బంధాలు, సమీకరణాలే ఎక్కువ ముఖ్యమా అనే అనుమానాలు కలగక మానవు.
రాజకీయ విస్తరణను తప్పుబడుతూ, ఆర్థిక నేరాలను, భూ కబ్జాలను రాజకీయ కక్షలంటూ వెనకేసుకురావడం ఏ రకమైన రాజకీయం? పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి ఒక న్యాయం, బొల్లా బ్రహ్మనాయుడు విషయానికి వచ్చేసరికి మరో న్యాయమా? ఈ వ్యత్యాసమే ఇప్పుడు సామాన్య ప్రజల్లో అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం సెంటిమెంట్‌ను వాడుకుంటూ, అసలైన ద్రోహాలను చూస్తూ ఊరుకోవడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టడమే అవుతుంది.

