Saptha Shanivara Vratham: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా సప్త శనివార వ్రతం చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఏడు శనివారాలు ఈ వ్రతం ఆచరించడం వల్ల కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఈ సప్త శనివారం వ్రతాన్ని ఆచరిస్తున్నారు. సాధారణ భక్తుల నుంచి మొదలుకొని సెలబ్రిటీలు కూడా ఈ వ్రతం చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు ఈ సప్త శనివార వ్రతం అంటే ఏంటి? ఈ వ్రతం ఎప్పుడు ప్రారంభించాలి? ఎలా చేయాలి అనే విషయానికి వస్తే..
సప్త శనివారం వ్రతం అనేది ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామికి చేసే ప్రత్యేక వ్రతం. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం అలాగే శని దోష నివారణ కోసం ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని వరుసగా ఏడు శనివారాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఇక ఈ సప్త శనివార వ్రతం చేయడానికి అనుకూలమైన రోజు ఏంటి అనే విషయానికి వస్తే సాధారణంగా ఈ వ్రతాన్ని శనివారం ప్రారంభించవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజు ఈ వ్రతం ప్రారంభించడం వల్ల రెట్టింపు ఫలితాలు ఉంటాయి. 
Saptha Shanivara Vratham: శ్రవణా నక్షత్రం రోజున చేస్తే మంచి ఫలితం..
ఇలా శ్రవణా నక్షత్రం శనివారం వచ్చిన రోజు ఈ వ్రతం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది .అదేవిధంగా ఏకాదశి, పౌర్ణమి వంటి రోజులలో ఈ వ్రతాన్ని ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. శనివారం ఉదయమే నిద్ర లేచి స్నానం ఆచరించి స్వామి వారి విగ్రహం లేదా చిత్రపటాన్ని శుభ్రం చేసుకొని అలంకరించుకోవాలి. బియ్యపు పిండితో ఏడు దీపాలను తయారు చేసుకొని వాటికి బొట్లు పెట్టుకొని ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. పూజ చేసుకున్న అనంతరం స్వామి వారికి పాయసం, బెల్లం, నువ్వులతో చేసిన మిఠాయిలు నైవేద్యంగా సమర్పించాలి.పూజ అనంతరం సప్త శనివారాల వ్రత కథను చదువుకుని, హారతి ఇవ్వాలి. ఇక ఏడు వారాలు వ్రతం పూర్తి అయిన తర్వాత ఏడవ శనివారం నాడు యథా విధిగా పూజ ముగించుకుని, బ్రాహ్మణులకు దానాలు లేదా పేదలకు అన్నదానం చేయడం, ఏడుగురు ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వటం వల్ల వ్రత ఫలితం దక్కుతుంది.

