Coconut Water: కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతో శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో, డీహైడ్రేషన్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వేసవిలో లేదా వ్యాయామం తర్వాత కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో కోల్పోయిన ద్రవాలు తిరిగి భర్తీ అవుతాయి. అందుకే కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తుంటారు కానీ కొన్ని రకాల జబ్బులతో బాధపడేవారు కొబ్బరినీళ్ళకు దూరంగా ఉండాలని కూడా ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి కొబ్బరి నీళ్లకు ఎవరు దూరంగా ఉండాలి అనే విషయానికి వస్తే
ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు కొబ్బరి నీళ్లు తాగే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఉండే అధిక పొటాషియం కారణంగా కిడ్నీల పనితీరు పై తీవ్రమైన ప్రభావం చూపడం వల్ల రక్తంలో పొటాషియం స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే తక్కువ రక్తపోటు ఉన్నవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగితే బీపీ మరింత తగ్గే అవకాశం ఉంది.ఇక మధుమేహం ఉన్నవారు కూడా పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవడం మంచిది, ఎందుకంటే ఇందులో సహజ చక్కెరలు ఉంటాయి. ఇక వర్షా కాలంలో జలుబు దగ్గు వంటి సమస్యలతో బాధపడే వారు కూడా కొబ్బరినీళ్ళకు దూరంగా ఉండటం మంచిది.

Coconut Water: దీర్ఘకాలిక సమస్యలకు మందులు వాడేవారు..
పలు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ మందులు వాడుతున్న వారు కూడా కొబ్బరి నీళ్లు తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ అందరి విషయంలోనూ ఒకే విధంగా వీటి పనితీరు ఉండదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఏ విధమైనటువంటి జబ్బులు లేకుండా ఉన్నవారు ఎలాంటి సందేహాలు లేకుండా కొబ్బరి నీళ్లను తాగవచ్చు. కొబ్బరినీళ్లు శరీర ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

