Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన శరీరంలో ఏ ఒక్క భాగం అయిన అనారోగ్యానికి గురైనప్పుడు ఆ ప్రభావం మన శరీరపై పూర్తిగా పడుతుంది. ఇక మన శరీరంలో భాగమైనటువంటి దంతాల ఆరోగ్యం కూడా ఎంతో అవసరం. దంతాలు కేవలం నమలడానికి తినడానికే కాకుండా మన అందాన్ని రెట్టింపు చేయడంలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ఇలా ఎంతో కీలక ప్రాధాన్యత కలిగినటువంటి దంతాల సంరక్షణ కూడా ఎంతో ముఖ్యం. అయితే మనకున్నటువంటి కొన్ని చెడు అలవాట్ల కారణంగా దంత ఆరోగ్యాన్ని కోల్పోతున్నాము. మీలో కూడా ఇలాంటి అలవాట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ దంతాలు ప్రమాదంలో ఉన్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. మరి దంత క్షయం కలిగించే ఆ చెడు అలవాట్లు ఏంటి అనే విషయానికి వస్తే..
సాధారణంగా చాలామందికి గోర్లు కొరికే అలవాటు ఉంటుంది. ఏదైనా టెన్షన్ లో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే గోర్లు కొరికేస్తూ ఉంటాము అలాగే మరికొందరికి ఇది అలవాటుగా మారి ఉంటుంది. ఇలా మీకు కూడా గోర్లు కొరికే అలవాటు ఉంటే కచ్చితంగా మీ దంతాలు ప్రమాదంలో పడినట్లే.. ఇలా గోర్లు కొరకటం వల్ల గోర్లలో ఉన్న బ్యాక్టీరియా మన దంతాలపైకి చేరి దంత క్షయం కావడానికి కారణమవుతుంది. అదేవిధంగా మనం ఏదైనా తినేటప్పుడు ఎక్కువగా నమిలి తినటం వల్ల దంతాలపై ఒత్తిడి ఏర్పడుతుంది. తద్వారా దంతాల మధ్య గ్యాప్ ఏర్పడటం చిగుళ్ళు వాపు రావడం వంటివి జరుగుతాయి.

Tooth Decay: నెలల తరబడి ఒకే బ్రష్ వాడటం..
ఇటీవల కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఎక్కువగా కూల్డ్రింక్స్ తాగుతూ ఉంటారు ఇలా డ్రింక్స్ తీసుకోవడం వల్ల వాటిలో ఉండే రసాయనాలు పంటి పై పొరను పూర్తిగా దెబ్బతీస్తాయి తద్వారా పళ్ళు పుచ్చిపోవటం పంటి నొప్పి రావడం లాంటివి జరుగుతుంటాయి. ఇక చాలామంది ఒకే బ్రష్ ను నెలల తరబడి ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా ఒక బ్రష్ ఎక్కువ కాలం ఉపయోగించటం వల్ల కూడా దంత సమస్యలు ఏర్పడతాయి. అందుకే ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్రష్ మార్చడం ఎంతో అవసరం. ఇక మనం ఏదైనా తిన్న తర్వాత తప్పనిసరిగా నీళ్లు పుక్కిలించడం, రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయడం వంటి అలవాట్ల ద్వారా ఈ దంతక్షయం నుంచి బయటపడవచ్చు.

