AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్ పాలిటిక్స్’ తెరపైకి వచ్చాయి. దశాబ్దాలుగా ఆళ్లగడ్డ గడ్డపై ఆధిపత్యం కోసం పోరాడుతున్న భూమా, గంగుల కుటుంబాల మధ్య నడుస్తున్న సాంప్రదాయ వైరం.. ఇప్పుడు అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ తలనీలాల టెండర్ల చుట్టూ తిరుగుతోంది. నిన్నటివరకు అంతర్గతంగా సాగిన ఈ వివాదం, ఇప్పుడు ఒక్కసారిగా నంద్యాల జిల్లా రాజకీయాల్లో అగ్నిగుండంలా రగిలిపోతోంది. టెండర్ల నిధులు, ముడుపుల వ్యవహారం ఇరువర్గాల మధ్య వ్యక్తిగత సవాళ్ల ప్రతిసవాళ్లకు దారితీయడంతో స్థానికంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఈ పొలిటికల్ హైడ్రామాకు గంగుల నాని (బ్రిజేంద్రనాథ్ రెడ్డి) వేసిన ఒక్క ఆరోపణే ఆజ్యం పోసింది. అహోబిలం దేవస్థానం తలనీలాల తరలింపు వెనుక స్థానిక టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ముడుపులు అందాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో పెను దుమారం రేపాయి. తమకు అందాల్సిన వాటా అందకపోవడం వల్లే ఎమ్మెల్యే ఈ టెండర్లను అడ్డుకుంటున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించడంతో ఆళ్లగడ్డ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి.

AP POLITICS: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఊహించని రేంజ్‌లో రియాక్ట్ అయ్యారు.
ఈ అవినీతి ఆరోపణలపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఊహించని రేంజ్‌లో రియాక్ట్ అయ్యారు. అహోబిలం ఈఓ చేస్తున్న అక్రమాలపై తాను పోరాడుతుంటే, మధ్యలో వైసీపీ నేతలకు ఏం పని అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా, “నీ దగ్గర నిజంగానే ఆధారాలు ఉంటే.. జిల్లా ఎస్పీ ఆఫీసులోనే తేల్చుకుందాం రా!” అంటూ గంగుల నానికి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఒకవేళ తాను ఒక్క రూపాయి ముడుపులు తీసుకున్నట్లు నిరూపిస్తే క్షణాల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే గంగుల నాని ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని సంచలన డిమాండ్ చేశారు. సవాల్ చేయడమే కాకుండా, తన అనుచరులతో కలిసి అహోబిలం చేరుకోవడంతో పాటు, గంగుల ఇంటి ముట్టడికి కూడా వెనుకాడనని ప్రకటించడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
ప్రస్తుతం ఆళ్లగడ్డలో ఇరుపక్షాలు ఎక్కడా తగ్గేదే లేదంటూ పంతాలకు పోతుండటంతో పోలీసులు భారీగా మోహరించారు. గంగుల వర్గం కూడా తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని, ఆధారాలు చూపించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తుండటంతో ఈ హెయిర్ వార్ రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరగబోతోందనేది నంద్యాల జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

