Mon. Jul 6th, 2026

    AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి అనే పేరుకు ఉన్న వైబ్రేషన్స్ వేరు. రంగా మరణించి దశాబ్దాలు గడుస్తున్నా.. కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా కాపు సామాజికవర్గంలో ఆయన క్రేజ్ రవ్వంతైనా తగ్గలేదు. ఇప్పటికీ ఆయన జయంతి, వర్ధంతుల వేళ విజయవాడ సహా పలు జిల్లాలు రంగా నామస్మరణతో మారుమోగిపోతుంటాయి. అయితే, తాజాగా రంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో సరికొత్త చర్చకు దారితీశాయి. ఆమె జనసేన వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం జోరందుకోవడంతో.. ఇది పవన్ కళ్యాణ్‌కు కలిసివచ్చే అంశమా? లేక కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుందా? అనే విశ్లేషణలు మొదలయ్యాయి.

    ఇన్నాళ్లూ రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న ఆశాకిరణ్.. గత కొంతకాలంగా రంగా ఆశయాల సాధన పేరిట జనాల్లోకి వస్తున్నారు. తాజాగా విజయవాడను ‘వంగవీటి రంగా జిల్లా’గా మార్చాలని, కృష్ణా తీరంలో ‘రంగా స్మారక ఘాట్’ నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ రెండు కీలక డిమాండ్లతో త్వరలోనే తాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్నట్లు ప్రకటించడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. అన్న వంగవీటి రాధాకృష్ణ ఇప్పటికే టీడీపీలో యాక్టివ్‌గా ఉంటే.. చెల్లెలు ఆశాకిరణ్ పవన్‌ను కలవాలనుకోవడం వెనుక కేవలం వినతులు మాత్రమే లేవని, ఆమె చూపు జనసేన వైపే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

    ap-politics-vangaveeti-asha-in-janasena-a-plus-or-a-minus-for-pawan
    ap-politics-vangaveeti-asha-in-janasena-a-plus-or-a-minus-for-pawan

    AP POLITICS: వంగవీటి ఆశాకిరణ్ కనుక జనసేన గూటికి చేరితే 

    అయితే వంగవీటి ఆశాకిరణ్ కనుక జనసేన గూటికి చేరితే పవన్ కళ్యాణ్‌కు అది ఖచ్చితంగా పెద్ద మైలేజ్ ఇస్తుందనేది ఒక వాదన. వంగవీటి రంగా కూతురు తమ పార్టీలో ఉంటే.. రంగా అభిమానులను, కాపు సామాజికవర్గాన్ని మరింత బలంగా జనసేన వైపు తిప్పుకోవచ్చు. అలాగే వంగవీటి కుటుంబం నుంచి ఒక మహిళా నేత పవన్ వెంట నడిస్తే.. కోస్తా బెల్ట్‌లో జనసేనకు తిరుగులేని మహిళా సెంటిమెంట్ కూడా తోడవుతుంది. అదే స‌మ‌యంలో రాబోయే రోజుల్లో కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో జనసేన క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నింపేందుకు వంగవీటి బ్రాండ్ ఇమేజ్ బాగా ఉపయోగపడుతుంది.

    ఇక నాణేనికి రెండో వైపు ఉన్నట్లు.. ఈ పరిణామం కూటమి రాజకీయాల్లో కొన్ని సవాల్‌లను కూడా తెచ్చిపెట్టే ప్రమాదం లేకపోలేదు. ముఖ్యంగా వంగవీటి రాధా ఇప్పటికే టీడీపీలో ఉన్నారు. ఇప్పుడు ఆశాకిరణ్ జనసేనలోకి వస్తే.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలు రెండు వేర్వేరు పార్టీల్లో ఉన్నట్లవుతుంది. సీట్ల కేటాయింపు లేదా భవిష్యత్తు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఇరు పార్టీల మధ్య ఇది ఈగో క్లాష్‌లకు దారితీసే అవకాశం ఉంది. అలాగే విజయవాడ రాజకీయాల్లో వంగవీటి వర్గానికి, ఇతర సామాజికవర్గ నేతలకు దశాబ్దాల నాటి విభేదాలు ఉన్నాయి. ఆశాకిరణ్‌కు పవన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే.. స్థానికంగా ఉండే ఇతర సామాజికవర్గాల మద్దతుదారులు జనసేనకు దూరం అయ్యే రిస్క్ కూడా ఉంది. ఏదేమైనా ఇప్పుడు రంగా వారసురాలిని పార్టీలోకి ఆహ్వానించి, ఆమె రెండు డిమాండ్లను కూటమి ప్రభుత్వం తరఫున నెరవేర్చగలిగితే.. పవన్ ఇమేజ్ స్కై హైకి వెళ్లడం ఖాయం. మరి ఈ ఈక్వేషన్ పవన్‌కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.