Covid 19: కరోనా వైరస్ మరోసారి తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. 2020 -21వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ వైరస్ నుంచి బయటపడ్డామని ఊపిరి పీల్చుకున్నలోపే మరోసారి విశ్వరూపాన్ని చూపిస్తుంది. కరోనా ఒమిక్రాన్ఆర్ఎఫ్ 5 అనే కొత్త వేరియంట్ రూపంలో ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
తూర్పు గోదావరి, గుంటూరు, వైఎస్ఆర్ కడప, విశాఖపట్నం జిల్లాలలో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి.తాజాగా అనంతపురం, కాకినాడ జిల్లాలలో కూడా కొత్త కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది.ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా50 కేసులు నమోదు అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 32 యాక్టివ్ కేసులు ఉండగా,25 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడిన వారిలో 14 మంది కోలుకోగా, నలుగురు మరణించినట్లు తెలుస్తోంది.

Covid 19: ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త..
ఈ విధంగా కరోనా వైరస్ రోజురోజుకు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. ప్రస్తుతం రూపాంతరం చెందిన ఒమిక్రాన్ ఆర్ ఎఫ్5 వేరియంట్ ప్రమాదకరమైనది కాదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఒక వారం పైగా దగ్గు, జ్వరం, జలుబు,ఒళ్ళు నొప్పులతో బాధపడేవారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని అదేవిధంగా ఈ లక్షణాలు ఉన్నవారు హోం ఐసోలేషన్ లో ఉండడం మంచిదని అధికారులు తెలియజేస్తున్నారు. ఇక బయటకు వచ్చిన సమయంలో కూడా సామాజిక దూరం పాటించాలి అదేవిధంగా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అధికారులు కీలక సూచనలను తెలియజేస్తున్నారు.

