Night Sleep: ఈ రోజుల్లో చాలా మంది రాత్రి సరిగా నిద్ర రావడం లేదు అని బాధపడుతున్నారు. ఇలా రాత్రి నిద్ర పట్టకపోవడానికి పని ఒత్తిడి కారణం. అదేవిధంగా మొబైల్ ల్యాప్ టాప్ ఎక్కువగా వాడటం కూడా కారణం కావచ్చు. అనారోగ్యకరమైన ఆహారం, అలవాట్లు లేకపోవడం రాత్రి నిద్ర పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక వ్యక్తికి రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర అవసరం. కానీ 5 గంటల కంటే తక్కువ నిద్రపోతే శరీరం, మెదడు రెండూ అలసిపోతాయి. నిద్రలేమి సమస్య మొదట్లో సాధారణం అనిపించినా, రోజులు గడిచేకొద్దీ అది పెద్ద జబ్బులకు దారితీస్తుంది.
మనకు సరైన నిద్ర లేకపోవడం వల్ల మధుమేహం, బీపీ, గుండె జబ్బులు వచ్చే అవకాశం 3 రెట్లు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నిద్రలోనే మన శరీరం హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే ఊబకాయం రావడానికి కూడా కారణమవుతుంది. నిద్ర లేకపోతే ఆకలి హార్మోన్లు గందరగోళంగా మారి ఎక్కువగా తినాలనిపిస్తుంది తద్వారా అధిక శరీర బరువు పెరగడానికి కారణం అవుతుంది. జ్ఞాపకశక్తి తగ్గడం, చిరాకు, డిప్రెషన్, ఆందోళన లాంటి మానసిక సమస్యలు కూడా నిద్రలేమి వల్లే వస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గి తరచుగా జ్వరం, ఇన్ఫెక్షన్లు వంటివి రావడానికి కారణం అవుతాయి.

Night Sleep: పిల్లల ఎదుగుదల పై ప్రభావం..
రాత్రి నిద్ర లేకపోతే పగలు ఆఫీస్ లో ఏకాగ్రత ఉండదు. చిన్న చిన్న విషయాలకు కోపం వస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇక పిల్లల విషయంలో సరిగా నిద్ర లేకపోతే వారి ఎదుగుదలపై ప్రభావం చూపడమే కాకుండా చదువుపై సరైన ఏకాగ్రత కూడా ఉండదు. సరైన నిద్ర లేకపోవడం వల్ల కళ్ల కింద చారలు ఏర్పడటం చర్మం కాంతి విహీనంగా మారుతుంది. అందుకే ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర ఎంతో అవసరం. రాత్రిపూట సరైన నిద్ర కోసం పడుకునే ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.గోరు వెచ్చని పాలు తాగాలి. అదేవిధంగా రాత్రి పూట పూర్తిగా జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. రాత్రి 8 లోపు తేలికగా భోజనం చేసి 30 నిమిషాలు నడక లేదా యోగా చేస్తే నిద్ర బాగా పడుతుంది.

