AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లూ రాజ్యసభ స్థానాల పైనే ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన నాలుగు సీట్లను దక్కించుకునేందుకు కూటమి సర్కార్ సర్వసన్నద్ధమైంది. అయితే, ఈ ఎన్నికల్లో సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఒక ఆసక్తికరమైన హాట్ లిస్ట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో తెగ వైరల్ అవుతోంది. మిత్రపక్షాల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.
సాధారణంగా ఇలాంటి కీలక సమయాల్లో కేంద్ర అధికార పార్టీ బీజేపీ ఒత్తిడి ఉంటుంది. కానీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు సమాచారం. టీడీపీలో ఆశావహుల సంఖ్య భారీగా ఉండటంతో, ఈసారికి బీజేపీకి అవకాశం ఇవ్వలేమని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు కమలం పార్టీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఖాళీ అయిన నాలుగు సీట్లలో మూడు స్థానాలను తెలుగుదేశం, ఒక స్థానాన్ని జనసేన పంచుకోవాలని డిసైడ్ అయ్యాయి.

AP POLITICS: టీడీపీ కోటాలో రాబోయే మూడు సీట్ల కోసం నలుగురు ప్రముఖుల పేర్లు
టీడీపీ కోటాలో రాబోయే మూడు సీట్ల కోసం నలుగురు ప్రముఖుల పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయి. పార్టీకి సుదీర్ఘకాలంగా నమ్మకంగా ఉంటూ, ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న సానా సతీష్‌కు చంద్రబాబు మరోసారి అవకాశం ఇవ్వడం దాదాపు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, పార్టీ గెలుపోటములతో సంబంధం లేకుండా విధేయుడిగా కొనసాగుతున్న భాష్యం రామకృష్ణను ఈసారి పెద్దల సభకు పంపాలని హైకమాండ్ ఫిక్స్ అయిందట. ఇక మూడో సీటు కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. సీనియర్ నేత వర్ల రామయ్య, స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ రేసులో ఉన్నారు. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయతను బట్టి వీరిద్దరిలో ఒకరికి అదృష్టం వరించనుంది.
మరోవైపు, జనసేనకు కేటాయించిన ఏకైక స్థానంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు టాక్. మధ్యలో కొందరు రాజకీయ నాయకుల పేర్లు వినిపించినప్పటికీ, ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ వైపే పవన్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పార్టీ ఆర్థిక బలానికి, భవిష్యత్తు అవసరాలకు రమేశ్ అభ్యర్థిత్వం కరెక్ట్ అని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి, అభ్యర్థుల ఎంపికపై కూటమిలో దాదాపు కసరత్తు పూర్తయినట్లే కనిపిస్తోంది. త్వరలోనే అధికారికంగా ఈ పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.

