Sun. Jun 14th, 2026

    AP POLITICS: ఉభయ గోదావరి జిల్లాల రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే వార్త హాట్ టాపిక్‌గా మారింది. దివంగత కాపు హృదయ సామ్రాట్ వంగవీటి మోహన రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్.. కాపు ఉద్యమ సీనియర్ నేత, ప్రస్తుత వైసీపీ లీడర్ ముద్రగడ పద్మనాభంతో రహస్యంగా భేటీ అయ్యారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌ను షేక్ చేస్తోంది. గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న ఆశా కిరణ్.. ఒక్కసారిగా కిర్లంపూడిలో ప్రత్యక్షమవడం వెనుక పెను రాజకీయ వ్యూహమే దాగి ఉందనే చర్చ మొదలైంది.

    గత ఏడాది కాలంగా ఆశా కిరణ్ రాజకీయ రంగ ప్రవేశంపై రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. తాను పాలిటిక్స్‌లోకి వస్తున్నానని గతంలోనే ఆమె స్వయంగా ప్రకటించారు. అయితే, నేరుగా కాకుండా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తానని స్పష్టం చేశారు. ఆ తర్వాత విజయవాడ నుంచి వైజాగ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. కానీ, ఆ తర్వాత ఆమె పెద్దగా ఎక్కడా కనిపించకపోవడంతో లైమ్‌లైట్ నుంచి తప్పుకున్నారనే ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు ముద్రగడతో భేటీ ద్వారా ఆమె రీ-ఎంట్రీకి బలమైన స్కెచ్ వేశారని అనుకుంటున్నారు.

    ap-politics-rangas-heir-joins-ycp-secret-meeting-with-mudragada
    ap-politics-rangas-heir-joins-ycp-secret-meeting-with-mudragada

    AP POLITICS: ముద్రగడ పద్మనాభాన్ని తొలి గేట్‌వేగా ఎంచుకుని

    అంత‌ర్గ‌త‌ వర్గాల సమాచారం ప్రకారం.. వంగవీటి ఆశా కిరణ్ గత వారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్లారు. అక్కడ వీరిద్దరి మధ్య దాదాపు గంటకు పైగా సుదీర్ఘ చర్చలు నడిచినట్లు తెలుస్తోంది. కేవలం మర్యాదపూర్వకంగానే కలిశారా? లేక దీని వెనుక పొలిటికల్ ఎజెండా ఉందా? అంటే కచ్చితంగా రాజకీయాల గురించేనని కాపు సామాజికవర్గ నేతలు బలంగా నమ్ముతున్నారు. తన పొలిటికల్ కెరీర్‌కు సరైన రూట్ మ్యాప్ సిద్ధం చేసుకునేందుకే ఆమె ముద్రగడను కలిశారనేది ఇన్‌సైడ్‌ టాక్.

    గతంలోనూ పలువురు కాపు సామాజికవర్గ ముఖ్య నేతలు కిర్లంపూడి వచ్చి ముద్రగడతో చర్చలు జరిపిన తర్వాతే వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఆశా కిరణ్ కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. నిజానికి గతంలోనే ఆమెను పార్టీలోకి ఆహ్వానించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేసింది. కానీ, అప్పట్లో ఆమె సేవా రంగం వైపే మొగ్గు చూపారు. అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆమె డిసైడ్ అయినట్లు సమాచారం. అందుకోసమే ముద్రగడ పద్మనాభాన్ని తొలి గేట్‌వేగా ఎంచుకుని, ఆయన ద్వారా లైన్ క్లియర్ చేసుకుంటున్నారనే ప్రచారం జోరందుకుంది. కాగా, ఈ భేటీపై అటు ముద్రగడ కానీ, ఇటు ఆశా కిరణ్ కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.