Mon. Jun 29th, 2026

    AP NEWS: విశాఖపట్నంలో ల్యాండ్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లునునుకుపోయిందో చెప్పడానికి తాజా ఘటనే నిదర్శనం. సామాన్యుల ప్లాట్లను టార్గెట్ చేసే భూ బకాసురులు.. ఇప్పుడు ఏకంగా అధికార పీఠంలో ఉన్న పెద్దల ఆస్తులపైనే కన్నేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు చెందిన కోట్ల విలువైన స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో కాజేయాలని చూసిన అంతర్రాష్ట్ర ముఠా వ్యవహారం ఇప్పుడు విశాఖలో హాట్ టాపిక్‌గా మారింది.

    విశాఖపట్నంలో అత్యంత డిమాండ్ ఉన్న మధురవాడ ఏరియాలో రఘురామకృష్ణరాజుకు 1989 నుంచి 333.33 గజాల సొంత స్థలం ఉంది. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ దాదాపు రూ.2 కోట్లకు పైనే పలుకుతోంది. అయితే, ఈ ల్యాండ్ చాలా కాలంగా ఎలాంటి నిర్మాణాలు లేకుండా ఖాళీగా ఉండటాన్ని గమనించిన ఓ కేటుగాళ్ల ముఠా దీనిపై కన్నేసింది. ఎలాగైనా ఈ భూమిని నొక్కేయాలని పక్కా స్కెచ్ వేసింది.

    ap-news-raghurama-krishna-rajus-land-targeted-land-worth-₹2-crore-goes-missing
    ap-news-raghurama-krishna-rajus-land-targeted-land-worth-₹2-crore-goes-missing

    AP NEWS: రఘురామకృష్ణరాజు సంతకాన్ని అచ్చుగుద్దినట్లు ఫోర్జరీ చేసిన గ్యాంగ్.. 

    ఈ వ్యవహారంలో నిందితులు వాడిన టెక్నిక్ చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సంతకాన్ని అచ్చుగుద్దినట్లు ఫోర్జరీ చేసిన ఈ గ్యాంగ్.. నకిలీ సేల్ డీడ్స్ సృష్టించింది. అంతటితో ఆగకుండా, చట్టంలోని లొసుగులను వాడుకుంటూ అధికారుల కళ్లు గప్పి ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు మీదకు యాజమాన్య హక్కులను కూడా బదిలీ చేసేశారు. ఇదంతా తెరవెనుక అత్యంత రహస్యంగా జరిగిపోయింది.

    ఇక కాగితాల మీద పని పూర్తయ్యాక, ప్రాక్టికల్‌గా స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు గత నెల మే 25, 26 తేదీల్లో సదరు ముఠా సభ్యులు రంగంలోకి దిగారు. రాత్రికి రాత్రే ఆ స్థలంలో చొరబడి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు ప్రయత్నించారు. అయితే, అక్కడ జరుగుతున్న హడావుడిని గమనించిన రఘురామకృష్ణరాజు స్థానిక మిత్రుడు వెంటనే ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అలర్ట్ అయిన రఘురామ లీగల్ టీమ్ రంగంలోకి దిగింది. ఒరిజినల్ పత్రాలను, సదరు ముఠా చూపిస్తున్న కాగితాలను క్షుణ్ణంగా పరిశీలించగా.. అసలు మోసం బయటపడింది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో తన స్థలాన్ని కొట్టేయాలని చూసినట్లు నిర్ధారణ అయింది.

    ఈ భారీ భూ దందాపై రఘురామకృష్ణరాజు ప్రతినిధులు వైజాగ్ పీఎంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు జూన్ 20న అధికారికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాక్షాత్తూ డిప్యూటీ స్పీకర్ ఆస్తికే నకిలీ పత్రాలు సృష్టించారంటే.. ఈ ముఠా వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? దీని వెనుక ఏవైనా రాజకీయ శక్తులు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.