TDP PARTY: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సైరన్ మోగడంతో పచ్చ చొక్కాల లీడర్లలో కొత్త జోష్ రావాల్సింది పోయి, పాత భయాలు ముసురుకుంటున్నాయి. అసెంబ్లీలో తిరుగులేని మెజారిటీ ఉండటంతో ఈ సీట్లు గెలవడం పెద్ద లెక్కేం కాదు. కానీ, టీడీపీ చరిత్రను ఒకసారి తిరగేస్తే ఢిల్లీ వెళ్లినోళ్లంతా హ్యాండ్ ఇచ్చారు అనే ఒక నమ్మలేని నిజం కార్యకర్తలను వేధిస్తోంది. ఎన్టీఆర్ హయాం నాటి పి. ఉపేంద్ర దగ్గర్నుంచి, నిన్నమొన్నటి సుజనా చౌదరి, సీఎం రమేష్ వరకు పెద్దల సభకు వెళ్లిన మోస్ట్ ట్రస్టెడ్ లీడర్లంతా పార్టీ బ్యాడ్ టైమ్ చూడగానే బోర్డు తిప్పేసినవారే. 2019లో ఓడిపోయాక నలుగురు ఎంపీలు ఏకంగా టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసిన షాక్ నుంచి పార్టీ అధిష్ఠానం ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు.
ఈ బ్యాడ్ సెంటిమెంట్‌కు బ్రేక్ వేసేందుకే ఈసారి నారా లోకేష్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గతంలో కేవలం బిజినెస్ ఇంట్రెస్టులు, కార్పొరేట్ అంగబలం చూసి సీట్లు ఇస్తే.. వాళ్లు అధికారం మారగానే తమ కాంట్రాక్టులు కాపాడుకోవడానికి ఈజీగా జంప్ అయ్యారనేది లోకేష్ టీమ్ విశ్లేషణ. అందుకే ఈసారి పారాచూట్ సంస్కృతికి చెక్ పెట్టి, పార్టీ కోసం క్షేత్రస్థాయిలో లాఠీ దెబ్బలు తిన్న ఒరిజినల్ క్యాడర్‌కు లైన్ క్లియర్ చేయాలని చినబాబు గట్టి పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో కూడా వ్యాపారస్తులు వద్దు.. నిబద్ధత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ గళాలే ముద్దు అంటూ తమ్ముళ్లు ట్రెండ్ చేస్తున్నారు.

TDP PARTY: టీడీపీకి దక్కే మూడు సీట్ల కోసం పాత కార్పొరేట్ ముఖాలు
కూటమి లెక్కల ప్రకారం జనసేనకు ఒకటి పోను, టీడీపీకి దక్కే మూడు సీట్ల కోసం పాత కార్పొరేట్ ముఖాలు ఇప్పటికీ తెరవెనుక గట్టిగానే చక్రం తిప్పుతున్నాయి. కానీ, లోకేష్ అభ్యర్థుల వడపోతను అత్యంత పకడ్బందీగా చేస్తుండటంతో ఈసారి సీన్ మారడం ఖాయంగా కనిపిస్తోంది. మరి దశాబ్దాల నాటి ఈ రాజ్యసభ శాపాన్ని లోకేష్ తన సరికొత్త సెలెక్షన్ వ్యూహంతో తుడిచిపెట్టేస్తారా? లేదా మళ్లీ పాత తప్పులనే రిపీట్ చేస్తారా? అన్నదే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో బిగ్గెస్ట్ సస్పెన్స్.

