Wed. Jun 3rd, 2026
    Telangana: తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గచ్చిబౌలి వేదికగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’కు పోలీసులు బ్రేక్ వేయడంతో, జనసేనాని పవన్ కల్యాణ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రూట్ మార్చారు. సభకు అనుమతి నిరాకరించిన సైబరాబాద్ పోలీసుల నిర్ణయానికి కౌంటర్‌గా, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహాన్నే వేదికగా మార్చుకుని సంచలన ప్రెస్మీట్‌కు సిద్ధమయ్యారు.

    నిజానికి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో సంక‌ల్ప స‌భ‌ను నిర్వహించేందుకు జనసేన లీగల్ టీమ్ అన్ని లైన్లూ క్లియర్ చేసుకుంది. సుమారు రెండు వేల మంది ముఖ్య ప్రతినిధులతో ఇండోర్ మీటింగ్ పెట్టాలనుకున్నప్పటికీ.. ట్రాఫిక్ ఇబ్బందులు, పార్కింగ్ సమస్యలు, శాంతిభద్రతల కారణాలను సాకుగా చూపిస్తూ సైబరాబాద్ పోలీసులు చివరి నిమిషంలో నో చెప్పారు. ఈ ఆకస్మిక తిరస్కరణతో జనసేన శ్రేణులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి.

    telangana-no-permission-for-jana-sena-sabha-pawan-changed-route
    telangana-no-permission-for-jana-sena-sabha-pawan-changed-route

    Telangana: తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై పవన్ కల్యాణ్ చెప్పాలనుకున్న..

    అయితే పోలీసుల నిర్ణయంతో అలర్ట్ అయిన పవన్ కల్యాణ్, సోషల్ మీడియా వేదికగా విసిరిన సెటైరికల్ విమర్శలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. “ఈ రోజు సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల మధ్య నా నివాసంలోనే మీడియా సమావేశం నిర్వహిస్తాను. తెలంగాణ పోలీస్ శాఖ కనీసం నా సొంత ఇంట్లో జనసేన నాయకులతో మాట్లాడుకోవడానికైనా అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నాను.. చూద్దాం ఏం జరుగుతుందో” అంటూ పవన్ చేసిన ఎక్స్ పోస్ట్ ప్రభుత్వ తీరును ఎండగట్టేలా ఉంది.

    సాధారణంగా ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో జరిగే ప్రెస్మీట్‌కు పోలీసుల అనుమతితో పని లేకపోయినా, అసలు జూబ్లీహిల్స్ నివాసం వద్ద పోలీసులు ఎలాంటి వ్యూహం అమలు చేస్తారనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ నివాస పరిసర ప్రాంతాల్లో హడావుడి పెరిగింది. అనుమతి నిరాకరణ వార్త తెలియగానే జనసేన అగ్రనేతలు, కార్యకర్తలు భారీగా జూబ్లీహిల్స్‌కు చేరుకుంటున్నారు. పోలీసులు సభను అడ్డుకున్నా, ప్రెస్మీట్ ద్వారా పవన్ కల్యాణ్ చెప్పాలనుకున్న పొలిటికల్ మెసేజ్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ఆయన ఏ రేంజ్‌లో ధ్వజమెత్తబోతున్నారు? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. భద్రతా కారణాల పేరుతో ఈ ప్రెస్మీట్‌పై కూడా ఆంక్షలు విధిస్తే గనుక, పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తోంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.