TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం విజయ్.. తాజాగా అవినీతి తిమింగలాల వేటకై ఒక సంచలన వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలో లంచగొండితనానికి శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ఆయన ప్రకటించిన ఒక సరికొత్త స్కీమ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్యులను పీడించే అధికారుల గుండెల్లో ఈ నిర్ణయం ఇప్పుడు రైళ్లు పరిగెత్తిస్తోంది.
సాధారణంగా ప్రభుత్వ ఆఫీసుల్లో చిన్న పని కావాలన్నా టేబుల్ కింద చేయి పెట్టనిదే ఫైళ్లు కదలవు అనేది బహిరంగ రహస్యం. అయితే, ఇకపై అలాంటి ఆటలు సాగవంటూ సీఎం విజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏ ప్రభుత్వ అధికారైనా కనీసం వెయ్యి రూపాయల లంచం డిమాండ్ చేసినా సరే.. బాధితులు వెనకడుగు వేయకుండా జేబులో ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు పని చెప్పాలని కోరారు. లంచం అడుగుతున్న సదరు అధికారి తీరును రహస్యంగా వీడియో తీసి, అవినీతి నిరోధక శాఖకు పంపడమే ప్రజలు చేయాల్సిన పని.

TVK PARTY: దేశంలోనే అవినీతి రహిత రాష్ట్రంగా తమిళనాడు
మీరు పంపిన వీడియో ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణ జరుపుతారు. ఆ వీడియోలో ఉన్నది నిజమేనని, సదరు అధికారి లంచం డిమాండ్ చేశాడని నిర్ధారణ అయితే.. ఫిర్యాదు చేసిన వారికి ప్రభుత్వం ఏకంగా రూ. 1 లక్ష నగదు బహుమతిని అందజేస్తుంది. లంచగొండుల సమాచారం ఇచ్చిన వారి వివరాలను కూడా పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఒక్క దెబ్బతో అటు అవినీతికి అడ్డుకట్ట పడటమే కాకుండా, తప్పును ఎత్తిచూపిన పౌరుడికి భారీ రివార్డ్ దక్కుతుంది.
ఈ విప్లవాత్మక పథకాన్ని పక్కాగా అమలు చేయడం కోసం రాష్ట్ర ఏసీబీ విభాగాన్ని సీఎం విజయ్ పూర్తిగా ప్రక్షాళన చేశారు. రాజకీయ జోక్యం లేకుండా అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఏసీబీకి పూర్తి స్వేచ్ఛను, అధికారాలను కల్పించారు. పరిపాలనలో పారదర్శకత తీసుకురావడమే ధ్యేయంగా వచ్చిన ఈ ‘లక్ష రూపాయల ప్లాన్’ సక్సెస్ అయితే.. దేశంలోనే అవినీతి రహిత రాష్ట్రంగా తమిళనాడు సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

