Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో తనదైన స్పీడుతో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు కూడా నజర్ పెట్టారు. కాంగ్రెస్ లాంటి సంప్రదాయ, సీనియర్లతో కూడిన మహా సముద్రంలో అనతికాలంలోనే తనదైన ముద్ర వేసిన రేవంత్.. కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా హైకమాండ్ వద్ద కూడా టాప్ ప్రయారిటీ లీడర్‌గా మారారు. తాజాగా కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి విజయం కోసం ఆయన చేసిన ప్రచారం, ఢిల్లీ వేదికగా జరుగుతున్న కీలక పరిణామాలు రేవంత్ రెడ్డి పొలిటికల్ గ్రాఫ్‌ను జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. అయితే, ఆయన ఢిల్లీ ఎంట్రీ ఎప్పుడు? దానికి ఆయన వేసుకున్న పక్కా ప్లాన్ ఏంటి? అనే దానికి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.
సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా రేపటి గురించి ఆలోచిస్తారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మరో పదేళ్ల తర్వాత ఏం చేయాలో ఇప్పుడే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. ఒక ప్రముఖ న్యూస్ కాంక్లేవ్‌లో స్వయంగా ఆయనే తన భవిష్యత్తు రాజకీయాలపై సంచలన ప్రకటన చేశారు. తాను 2034లో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడతానని స్పష్టం చేశారు. దీనర్థం.. 2028లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో పాటు, ఆ తర్వాత 2033లో జరిగే ఎన్నికల్లోనూ తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని, మరో టర్మ్ కూడా తానే ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని లీడ్ చేస్తానని రేవంత్ ఇన్ డైరెక్ట్‌గా హింట్ ఇచ్చేశారు. అంటే తెలంగాణలో కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే ధీమా ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Telangana Politics: మొదటి పదేళ్లు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు అంకితం
రాజకీయాల్లో తాను మరో ఇరవై ఏళ్ల పాటు యాక్టివ్‌గా ఉంటానని రేవంత్ రెడ్డి తరచూ చెబుతుంటారు. ఆ ఇరవై ఏళ్లను ఆయన 10+10 ఫార్ములాగా విభజించుకున్నారు. మొదటి పదేళ్లు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు అంకితం చేసి, ఇక్కడ పార్టీని తిరుగులేని శక్తిగా మార్చడం.. ఆ తర్వాతి పదేళ్లు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా చక్రం తిప్పడం. రేవంత్ రెడ్డి ఇంతటి బలమైన నమ్మకంతో ఉండటానికి రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలు కూడా ఆయనకు అనుకూలంగా ఉండటమే కారణం. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వరుస సంక్షోభాలతో ఇబ్బంది పడుతుండటం, మరోవైపు బీజేపీ క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పుంజుకోలేకపోవడం కాంగ్రెస్‌కు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారుతుందని రేవంత్ ముందే ఊహించారు.
భవిష్యత్తులో దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని బలంగా నమ్ముతున్న రేవంత్ రెడ్డి.. ఆ సమయానికి కేంద్రంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించాలని టార్గెట్ పెట్టుకున్నారు. 2034 నాటికి కేంద్రంలో కాంగ్రెస్ హవాను మరింత పెంచుతూ, జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు ఆయన ఇప్పటి నుంచే మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. ప్రాంతీయ పార్టీల అధినేతలకు భిన్నంగా, ఒక జాతీయ పార్టీలో ఉంటూనే ప్రాంతీయంగా పట్టు సాధించి.. అటు నుంచి దిల్లీ పీఠాన్ని శాసించేలా రేవంత్ రెడ్డి వేస్తున్న అడుగులు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. టార్గెట్ 2034 వైపు రేవంత్ వేగం చూస్తుంటే.. భవిష్యత్తులో ఢిల్లీ పాలిటిక్స్‌లో ఆయన కింగ్ అవుతారా లేక కింగ్ మేకర్ అవుతారా అనేది చూడాలి.

