TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు చేసినా, పనితీరు బాగోలేకపోయినా పిలిచి సున్నితంగా మందలించే చంద్రబాబు.. ఇప్పుడు రూట్ మార్చారు. మొహమాటాలు, బుజ్జగింపుల కాలానికి కాలం చెల్లిపోయిందని, పర్ఫార్మెన్స్ లేకపోతే సొంత పార్టీ నేతలైనా సరే ఇంటికి పంపడానికే సిద్ధమనే సంకేతాలను ఆయన బలంగా పంపుతున్నారు. ఈ మార్పు ఇప్పుడు కూటమి ప్రజాప్రతినిధుల్లో వణుకు పుట్టిస్తోంది.
సాధారణంగా ఎమ్మెల్యేల పనితీరు, ఇంటెలిజెన్స్ నివేదికలను చంద్రబాబు సీఎంఓ లేదా పార్టీ అంతర్గత సమీక్షలకే పరిమితం చేస్తారు. కానీ, తాజాగా నెల్లూరు జిల్లా కావలి పర్యటనలో ఆయన వ్యవహరించిన తీరు చూశాక సీనియర్ లీడర్ల మైండ్ బ్లాంక్ అయింది. స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి) నియోజకవర్గ ప్రగతిపై బాబు బహిరంగంగానే లెక్కలు తేల్చేశారు. 51 ప్రభుత్వ శాఖల్లో 13 కీలక శాఖల పనితీరు ఘోరంగా ఉందని, రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల ర్యాంకింగ్స్‌లో కావలి ఎమ్మెల్యే స్థానం 107వ ర్యాంకులో ఉందంటూ వేలాది మంది ప్రజల సాక్షిగా స్క్రీన్ బోర్డుపై పెట్టినట్లు చెంప చెళ్లుమనిపించే నిజాలు చెప్పారు.

TDP PARTY: ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
“గ్రూపు రాజకీయాలు పక్కనబెట్టి అందరినీ కలుపుకుపోవాలి.. పనితీరు మారకపోతే ఊరుకునేది లేదు” అంటూ సీఎం స్టేజ్ పైనే ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బహిరంగ సభలోనే సీఎం చంద్రబాబు ఇంత ఓపెన్‌గా, ఘాటుగా విమర్శలు గుప్పించారంటే.. ఇక తాడేపల్లిలో జరిగే అంతర్గత సమీక్షల్లో, వన్-టు-వన్ మీటింగుల్లో ఎమ్మెల్యేలకు ఏ రేంజ్‌లో క్లాస్ పీకుతుంటారోనని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. గతంలో కావ్య కృష్ణారెడ్డి వ్యవహారం పార్టీ క్రమశిక్షణా కమిటీ దాకా వెళ్లినా పెద్దగా మార్పు రాకపోవడంతోనే బాబు ఈసారి పబ్లిక్ గానే లైన్ క్లియర్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తప్పులను సరిదిద్దుకోకుండా కాలక్షేపం చేస్తే నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలను వెతుక్కోవడానికి కూడా వెనకాడనని ఈ ఘటన ద్వారా చంద్రబాబు స్పష్టం చేశారు.

