YSRCP: నిన్నటివరకు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ‘ఫ్రెండ్లీ’గా ఉంటూ, తెరవెనుక స్నేహాన్ని నడిపిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు రూట్ మార్చారు. ఢిల్లీ పాలకులకు ముఖం మీదే రాంరాం చెప్పేస్తూ.. పక్కా యాంటీ-బీజేపీ నరేటివ్‌ను తెరపైకి తెచ్చారు. ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత సైలెంట్‌గా ఉన్న జగన్, ఒక్కసారిగా గేర్ మార్చడం వెనుక బలమైన పొలిటికల్ మైండ్ గేమ్ ఉందనేది తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది.
ఇన్నాళ్లూ కేంద్ర పెద్దలపై నేరుగా విమర్శలు చేయడానికి వెనుకాడిన జగన్, ఇప్పుడు ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోం శాఖలనే బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR)పై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ఇటీవల బెంగాల్‌లో బీజేపీ విజయం వెనుక ఈ ప్రక్రియే ఉందంటూ ఆయన చేసిన విశ్లేషణ, జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఒక స్థానిక విమర్శ మాత్రమే కాదు.. ఢిల్లీ పీఠంపై జగన్ గురిపెట్టిన బాణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటు రాష్ట్రంలో పెట్రో ధరలపై నిరసనలు చేస్తూనే, అటు జాతీయ సంస్థల విశ్వసనీయతను ప్రశ్నించడం వెనుక పక్కా వ్యూహం కనిపిస్తోంది.

YSRCP: జగన్ ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో రాయబారాలు
రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. జగన్ ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వేదికగా కొన్ని సీక్రెట్ మీటింగ్స్ కూడా జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయ ఎంట్రీతో దక్షిణ భారత పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా, సౌత్‌లో బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ శక్తులను ఏకం చేయాలనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు టాక్. తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌తో చేతులు కలిపితే.. ఇటు జాతీయ స్థాయిలో రక్షణ, అటు రాష్ట్రంలో కోల్పోయిన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోవచ్చనేది జగన్ ప్లాన్ కావచ్చు.
ఇక జగన్ హఠాత్తుగా ప్లేట్ తిప్పేయడంతో బీజేపీ అధిష్ఠానం కూడా అప్రమత్తమైంది. ఇన్నాళ్లూ జగన్‌పై ప్రదర్శించిన సాఫ్ట్ కార్నర్‌ను పక్కనబెట్టి, వ్యూహాత్మకంగా చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఒకవైపు లోకల్ కేడర్‌లో జోష్ నింపడానికి బీజేపీని విలన్ గా చూపించడం.. మరోవైపు జాతీయ స్థాయిలో ఇండియా బ్లాక్ వైపు అడుగులు వేయడం.. ఇలా జగన్ ఆడుతున్న డబుల్ గేమ్ పై ఢిల్లీ పెద్దలు సీరియస్‌గా ఉన్నట్లు భోగట్టా.

