TDP PARTY: దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల హవా ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. తాజాగా ఎన్నికల సంస్కరణల కోసం పనిచేసే ప్రముఖ సంస్థ ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్’ (ADR) విడుదల చేసిన నివేదిక ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దేశంలోనే అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ADR నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఏకంగా రూ. 228.31 కోట్ల ఆదాయంతో దేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. కార్పొరేట్ విరాళాలు, ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఈ ఆదాయంతో జాతీయ స్థాయిలోని పెద్ద పెద్ద ప్రాంతీయ పార్టీలను కూడా టీడీపీ వెనక్కి నెట్టేసింది. ఈ లిస్ట్‌లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ రూ. 219.35 కోట్ల ఆదాయంతో రెండో స్థానంలో నిలిచింది.

TDP PARTY: టీడీపీ, వైసీపీలు ముందుండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ
ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో కీలక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రేసులో గట్టి పోటీనిచ్చింది. రూ. 140 కోట్ల ఆదాయంతో వైసీపీ దేశంలోనే మూడో అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా నిలిచింది. అయితే, ఆదాయం విషయంలో మూడో స్థానంలో ఉన్నప్పటికీ.. ఖర్చుల విషయంలో మాత్రం వైసీపీ సరికొత్త రికార్డ్ సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 340.20 కోట్లు ఖర్చు చేసి, దేశంలోనే అత్యధికంగా ఖర్చు చేసిన ప్రాంతీయ పార్టీగా మొదటి స్థానంలో నిలిచింది. ఖర్చుల విషయంలో ఒడిశాకు చెందిన బీజేడీ, బెంగాల్‌కు చెందిన టీఎంసీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
దేశవ్యాప్తంగా మొత్తం 67 ప్రాంతీయ పార్టీలు గుర్తింపు పొంది ఉండగా.. కేవలం 36 పార్టీలు మాత్రమే నిర్దేశిత సమయంలోగా తమ వార్షిక ఆడిట్ నివేదికలను సమర్పించాయి. ఆ 36 పార్టీల లెక్కలను బట్టే ఏడీఆర్ ఈ ఆసక్తికర నివేదికను రూపొందించింది. మిగిలిన పార్టీల వివరాలు కూడా వస్తే ఈ లెక్కలు మరికొంత మారే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ, దేశంలోనే అత్యధిక ఆదాయం, వ్యయం కలిగిన టాప్ పార్టీలలో ఏపీకి చెందిన టీడీపీ, వైసీపీలు ముందుండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

