Roja Selvamani: వైసీపీ హయాంలో ఫైర్ బ్రాండ్ గా సోషల్ మీడియాను, టీవీ స్క్రీన్లను ఊపేసిన మాజీ మంత్రి ఆర్కే రోజా గొంతు మళ్లీ లేచింది. 2024 ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో ఏకంగా 45 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాక.. దాదాపు సైలెంట్ అయిపోయిన రోజా, తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూలో మళ్లీ తన పాత వాడిని ప్రదర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా.. తనను ఎందుకు అరెస్ట్ చేయలేదన్న ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
రోజా లాజిక్ ప్రకారం.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తనను అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఆమెపై ఉన్న భయమేనట. గతంలో (2014-19 మధ్య) తనను అసెంబ్లీ నుంచి అకారణంగా సస్పెండ్ చేసి ఏడిపించినందుకు చంద్రబాబుకు అధికారం పోయిందని, ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందని ఆమె గుర్తు చేశారు. మహిళల జోలికి వస్తే శాపాలు తగులుతాయన్న భయంతోనే చంద్రబాబు తన జోలికి రావడం లేదని ఆమె సెలవిచ్చారు. అయితే, రాజకీయాల్లో కేసులు, అరెస్టులు అనేవి చట్ట పరిధిలో జరుగుతాయా లేక ఇలాంటి సెంటిమెంట్ల ఆధారంగా జరుగుతాయా అన్నది నెటిజన్లకు మింగుడుపడని ప్రశ్నగా మారింది.

Roja Selvamani: ఓటమి తట్టుకోలేక రెండు నెలల పాటు చెన్నైలో రిలాక్స్ అయిన రోజా!
ఇక తన మంత్రిత్వ శాఖలో ఎలాంటి అవినీతి జరగలేదని, కూటమి ప్రభుత్వం రాగానే తన ఫైళ్లన్నీ దులిపేసి ఉంటారని రోజా ధీమా వ్యక్తం చేశారు. ఏ తప్పు చేయలేదు కాబట్టే తనను టచ్ చేయలేకపోయారని చెప్పుకొచ్చారు. అన్నింటికంటే హైలైట్ ఏంటంటే.. తాము ఓడిపోవడానికి ప్రజలు కారణం కాదట, కేవలం ఈవీఎంల మహిమ వల్లే వై నాట్ 175 కాస్తా కేవలం 11 సీట్లకు పడిపోయిందని రోజా గట్టిగా నమ్ముతున్నారు. ఇంతటి భారీ ఓటమి తర్వాత కూడా ప్రజలు తమ వైపే ఉన్నారని క్లెయిమ్ చేయడం చూసి సొంత పార్టీ క్యాడరే ముక్కున వేలేసుకుంటోంది. ఓటమి తట్టుకోలేక రెండు నెలల పాటు చెన్నైలో రిలాక్స్ అయిన రోజా.. ఇప్పుడు మళ్లీ సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకుంటూ మైకుల ముందుకు రావడం ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.

