Tue. May 19th, 2026
    Narendra Modi: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగాయా? అయితే ఆ భారాన్ని పైసా పైసా చొప్పున లీటర్ మీద పెంచి సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టండి. మరి అదే ముడిచమురు ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయా? అయితే ఆ లాభాన్ని ప్రజలకు ఇవ్వకుండా ఎక్సైజ్ సుంకం, సెస్ ల రూపంలో ప్రభుత్వ ఖజానాకు మళ్లించండి! ఇదీ గత కొంతకాలంగా దేశంలో నడుస్తున్న ఇంధన ధరల రివర్స్ న్యాయం. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల నెపం చూపిస్తూ, సామాన్య పౌరుడికి నొప్పి తెలియకుండా భారం మోపడంలో చమురు సంస్థలు, కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

    ఒకేసారి ఐదు రూపాయలో, ఆరు రూపాయలో పెంచితే జనం రోడ్లపైకి వస్తారు, రాజకీయంగా నష్టం జరుగుతుంది. అందుకే ఇప్పుడు వ్యూహం మార్చారు. నాలుగు రోజుల క్రితం మూడు రూపాయలు పెంచిన చమురు సంస్థలు, ఆ వేడి చల్లారకముందే తాజాగా మరో 90 పైసలు వడ్డించాయి. వారం తిరిగేసరికి రూపాయి, రెండు రూపాయల చొప్పున పెంచుకుంటూ పోయే ఈ మైక్రో మేనేజ్‌మెంట్ వ్యూహం వెనుక పెద్ద స్కెచ్చే ఉంది. రోజువారీగా లేదా వారానికోసారి పైసల రూపంలో పెంచడం వల్ల వినియోగదారుడు పెద్దగా రియాక్ట్ అవ్వడు. కానీ, నెల తిరిగేసరికి అది నాలుగు నుండి ఐదు రూపాయల భారంగా మారి, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది.

    if-it-decreases-it-goes-to-the-treasury-if-it-increases-it-goes-to-the-people-where-is-the-justice-in-this-modi-saab
    if-it-decreases-it-goes-to-the-treasury-if-it-increases-it-goes-to-the-people-where-is-the-justice-in-this-modi-saab

    Narendra Modi: కేంద్ర ప్రభుత్వం పన్నుల పెంపుతో తన ఖజానాను నింపుకోవడానికే ప్రాధాన్యత.!

    అంతర్జాతీయ ట్రెండ్స్ ప్రకారం ధరలు పెరగడం సహజమే అని సరిపెట్టుకుందాం. కానీ, అంతర్జాతీయంగా బ్యారెల్ ధరలు పాతాళానికి పడిపోయినప్పుడు ఆ ప్రయోజనం సామాన్యుడికి ఎందుకు దక్కలేదు? అప్పుడు మార్కెట్ సూత్రాలు ఏమయ్యాయి? ముడిచమురు చౌకగా దొరికిన ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వం పన్నుల పెంపుతో తన ఖజానాను నింపుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చింది కానీ, లీటర్ ధరను యాభై రూపాయలకు తగ్గించే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా, ఇంధన ధరలు ఎప్పుడూ ఒక గరిష్ట స్థాయిలోనే స్థిరపడిపోయాయి. ఇప్పుడు పశ్చిమాసియాలో సంక్షోభం రాగానే, ఆ భారాన్ని యథావిధిగా జనం నెత్తినే రుద్దుతున్నారు.

    పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కేవలం బంకుల దగ్గరితోనే ఆగదు. డీజిల్ ధర పెరిగితే రవాణా ఛార్జీలు పెరుగుతాయి. రవాణా ఛార్జీలు పెరిగితే ఉల్లిపాయల దగ్గర నుంచి పప్పుల వరకు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. చివరకు మిగిలేది ఒక్కటే ప్రశ్న.. అంతర్జాతీయంగా నష్టాలు వస్తే భరించాల్సింది ప్రజలేనా? లాభాలు వస్తే దాచుకోవాల్సింది ప్రభుత్వ ఖజానాయేనా? సబ్ కా సాత్ అంటే సామాన్యుడిని ముంచడమేనా మోదీ సాబ్?

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.