Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్ ధర 105 డాలర్ల మార్కును దాటిపోవడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా స్థిరంగా ఉన్న ఇంధన ధరలు ఇప్పుడు ఒక్కసారిగా సామాన్యుడిపై భారం మోపేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదే తరుణంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చేసిన వ్యాఖ్యలు పెట్రో మంటపై క్లారిటీ ఇచ్చాయి.
రాష్ట్ర ఎన్నికల కోడ్ ముగియడంతో చమురు సంస్థలు ధరల సవరణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీ లోపు పెట్రోల్ ధర లీటరుకు ఏకంగా రూ. 5 వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల్లో గట్టి ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాలపై స్పందించిన మంత్రి పురి.. ధరల పెరుగుదల అన్నది పూర్తిగా మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని, దానికి ఎన్నికలతో ముడిపెట్టడం సరికాదని స్పష్టం చేశారు. గత నాలుగేళ్లుగా ధరలను నియంత్రించగలిగామని, కానీ ప్రస్తుత ప్రపంచ సంక్షోభం ఒక పెద్ద సవాల్ అని ఆయన పేర్కొన్నారు.

Petrol Price News: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఆందోళన.!
చమురు విక్రయ సంస్థలు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా రేట్లు పెంచకపోవడం వల్ల ఈ సంస్థలు రోజుకు రూ. 1,000 కోట్ల మేర నష్టపోతున్నాయని ఆయన వివరించారు. ఈ త్రైమాసికంలో నష్టాల విలువ ఏకంగా రూ. 1 లక్ష కోట్లకు చేరడంతో, కంపెనీల మనుగడ కోసం ధరల పెంపు దిశగా అడుగులు పడే అవకాశం కనిపిస్తోంది.
ధరల పెంపుపై ఆందోళన నెలకొన్నప్పటికీ, ఇంధన కొరత విషయంలో మంత్రి సానుకూల ప్రకటన చేశారు. ప్రధాని మోదీ దూరదృష్టితో దేశంలో సరిపడా చమురు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో 69 రోజులకు సరిపడా ముడి చమురు, 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని ఆయన భరోసా ఇచ్చారు. అంతేకాకుండా, ఎల్పీజీ ఉత్పత్తిని రోజుకు 54,000 టన్నులకు పెంచినట్లు వివరించారు. ఏది ఏమైనా, రానున్న వారం రోజులు వాహనదారులకు అత్యంత కీలకంగా మారనున్నాయి.

