Politics: భారత రాజకీయ చరిత్రలో సరికొత్త శకం ఆరంభమైంది. సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశ చరిత్ర పుటల్లో ఎవరికీ సాధ్యంకాని ఒక అరుదైన మైలురాయిని అధిగమించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల చేత ఎన్నుకోబడి, కేంద్రంలో ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘ కాలం పాటు దేశానికి సేవలందించిన ఏకైక ప్రధానిగా ఆయన సరికొత్త రికార్డును సృష్టించారు. ఈ క్రమంలో స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పేరిట దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును మోదీ తిరగరాశారు.
నిజానికి, దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు (1952) జరిగినప్పటి నుంచి లెక్కగడితే.. నెహ్రూ గరిష్టంగా వరుసగా 4,398 రోజులు ప్రధానిగా కొనసాగారు. కాగా, బుధవారం నాటికి ప్రధాని మోదీ 12 ఏళ్ల (4,399 రోజులు) నిరంతర పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని నెహ్రూను వెనక్కి నెట్టారు. గతంలో ఇందిరా గాంధీ 14 ఏళ్లకు పైగా ప్రధానిగా పనిచేసినప్పటికీ, ఆమె పాలన మధ్యలో విరామం వచ్చింది. కానీ, 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా చారిత్రక విజయాలు సాధిస్తూ వస్తున్న మోదీ.. బ్రేక్ లేని ప్రధానిగా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

Politics: దేశ రాజధాని వేదికగా భారీ వేడుకకు సర్వం సిద్ధమైంది.
ఈ చారిత్రాత్మక ఘనతను, కేంద్రంలో ఎన్డీఏ కూటమి 12 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని వేదికగా భారీ వేడుకకు సర్వం సిద్ధమైంది. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపంలో బుధవారం ఒక హై-ప్రొఫైల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, రాజ์నాథ్ సింగ్, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరుకానున్నారు. వీరితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 22 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కూటమి మిత్రపక్షాల నాయకులు ఒకే తాటిపైకి రానుండటం విశేషం. ఈ ప్రత్యేక వేదికపై ప్రధాని మోదీ సాధించిన చారిత్రక విజయానికి గుర్తింపుగా, ఆయనను అభినందిస్తూ ఎన్డీఏ కూటమి ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించనుంది.

