Andhra Pradesh: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్నాయి. ఇటీవల ఒక ప్రముఖ న్యూస్ పోర్టల్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన, తనదైన శైలిలో భవిష్యత్తు రాజకీయాలపై సంచలన అంచనా వేశారు. రాబోయే పదేళ్ల పాటు తెలంగాణలో తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని రేవంత్ రెడ్డి అత్యంత ధీమాగా ప్రకటించారు. ప్రతిపక్షాల విమర్శలను తాను అస్సలు పట్టించుకోనని, కేవలం ప్రజల తీర్పునే నమ్ముతానని స్పష్టం చేశారు. అయితే, ఆయన ఈ నమ్మకానికి వెనుక ఒక బలమైన పొలిటికల్ సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చారు. అదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
పెద్దగా చదువుకోని ఓటర్లు కూడా రాజకీయంగా ఎంత స్పష్టమైన తీర్పు ఇస్తారో చెప్పడానికి రేవంత్ రెడ్డి గత మూడు దశాబ్దాల చరిత్రను ఒక కేస్ స్టడీగా ఉదహరించారు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే, ఏ పార్టీ గెలిచినా వరుసగా రెండు టెర్ములు (పదేళ్ల పాటు) పాలించేలా ప్రజలు తీర్పు ఇస్తూ వస్తున్నారు. 1994, 1999లో టీడీపీ.. 2004, 2009లో కాంగ్రెస్.. అలాగే విభజన తర్వాత తెలంగాణలో 2014, 2018లో బిఆర్ఎస్ వరుసగా రెండేసి సార్లు అధికారంలోకి వచ్చాయి. ఈ లెక్కన 2023లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, 2028లో కూడా విజయం సాధించి తీరుతుందని రేవంత్ రెడ్డి బల్లగుద్ది మరీ చెబుతున్నారు. తెలంగాణ వరకు ఈ డబుల్ టెర్మ్ ఫార్ములా పక్కాగా వర్కవుట్ అవుతుందని విశ్లేషకులు కూడా అంగీకరిస్తున్నారు.

Andhra Pradesh: రేవంత్ రెడ్డి చెప్పిన ఈ పొలిటికల్ ఈక్వేషన్
రేవంత్ రెడ్డి చెప్పిన ఈ పొలిటికల్ ఈక్వేషన్ విన్న తర్వాత.. అందరి చూపు ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లింది. తెలంగాణలో ఓటర్లు ఒక ప్రభుత్వానికి పదేళ్ల పాటు టైమ్ ఇస్తుంటే, విభజన తర్వాత ఏపీలో సీన్ పూర్తిగా రివర్స్‌లో కనిపిస్తోంది. నవ్యాంధ్రలో తొలి ప్రభుత్వంగా 2014లో టీడీపీ కూటమి వస్తే.. ఐదేళ్లకే ఓటర్లు మార్పు కోరుకుంటూ 2019లో వైసీపీకి పట్టం కట్టారు. మళ్లీ ఐదేళ్లు తిరిగేసరికి 2024లో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించి, చంద్రబాబు కూటమిని భారీ మెజారిటీతో కూర్చోబెట్టారు. అంటే, ఏపీ ఓటర్లు కేవలం ఒక్క టెర్మ్ మాత్రమే ఏ పార్టీకైనా అవకాశం ఇస్తున్నారు. ఈ సింగిల్ టెర్మ్ ట్రెండ్ చూస్తుంటే, రేవంత్ రెడ్డి చెప్పిన పదేళ్ల సెంటిమెంట్ ఏపీకి అస్సలు వర్తించదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచే తెలంగాణ, సీమాంధ్ర ఓటర్ల ఆలోచనా విధానంలో స్పష్టమైన తేడా ఉందనేది విశ్లేషకుల అంచనా. 1999, 2009 ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే, ఆ నాడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను మళ్లీ గెలిపించడంలో తెలంగాణ ప్రాంతమే కీలక పాత్ర పోషించింది. 1999లో బాబుకు, 2009లో వైఎస్సార్‌కు తెలంగాణలోనే ఎక్కువ సీట్లు వచ్చాయి. కానీ, సీమాంధ్రలో మాత్రం ఎప్పుడూ యాంటీ-ఇంకంబెన్సీ (ప్రభుత్వ వ్యతిరేకత) తీవ్రంగా ఉండేది. ఏపీ ఓటర్లు ఐదేళ్లలోనే అంచనాలు మార్చుకుంటారా, లేక వారి రాజకీయ చైతన్యం ప్రతిసారీ కొత్త మార్పును కోరుకుంటుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాగా, ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు మాత్రం.. తాము 2029లోనే కాదు, రాబోయే 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని చెబుతున్నారు. మరోవైపు, ఏపీ ఓటర్ల హిస్టరీ ప్రకారం ఐదేళ్ల తర్వాత పవర్ మారడం ఖాయమని, ఈ ట్రాక్ రికార్డే తమను మళ్లీ గద్దెనెక్కిస్తుందని వైసీపీ బలంగా నమ్ముతోంది.

