Wed. May 13th, 2026

    TDP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గంగా మారిన పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే SVSN వర్మను తప్పిస్తూ అధిష్టానం నిర్ణ‌యం తీసుకుంది. గత కొంతకాలంగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు, మిత్రపక్షం జనసేనతో తలెత్తుతున్న విభేదాల నేపథ్యంలో చంద్రబాబు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వర్మ స్థానంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు స‌మాచారం.

    నిజానికి, ఈ నిర్ణయానికి కేవలం మూడు రోజుల ముందే వర్మ అమరావతిలో మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని వివరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఆ భేటీ జరిగిన కొద్ది రోజుల్లోనే వర్మపై వేటు పడటం కేడర్‌లో చర్చనీయాంశమైంది. లోకేష్‌ను కలిసిన సమయంలోనే వర్మకు గట్టి సంకేతాలు అందినట్లు సమాచారం. వ్యక్తిగత ఆధిపత్యం కంటే కూటమి ప్రయోజనాలే ముఖ్యమని భావించిన అధిష్టానం, వర్మను పక్కన పెట్టడమే సరైన మార్గమని నిర్ణయించుకుంది.

    tdp-pithapuram-varma-gets-a-shock-from-chandra-babu-he-is-out-of-the-post
    tdp-pithapuram-varma-gets-a-shock-from-chandra-babu-he-is-out-of-the-post

    TDP: వర్మను తప్పించిన తర్వాత పిఠాపురం టీడీపీలో కొత్త సమీకరణాలు

    పిఠాపురం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ ప్రతి కదలిక అత్యంత ముఖ్యం. అయితే, ఇక్కడ ప్రోటోకాల్ విషయంలో వర్మ పదేపదే జనసేన నేతలతో వివాదాలకు దిగడం చంద్రబాబు దృష్టికి వెళ్ళింది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారిక ఫ్లెక్సీలలో ముఖ్యమంత్రి ఫోటోలు లేవంటూ వర్మ రచ్చ చేయడం, జనసేన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో బాహాబాహీకి దిగడం వంటి ఘటనలు కూటమి ప్రతిష్టను దెబ్బతీశాయని అధిష్టానం భావించింది.

    కూటమి నేతల మధ్య సమన్వయం దెబ్బతింటే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఫ్లెక్సీల కోసం, కుర్చీల కోసం గొడవ పడటం సరికాదని, అలాంటి ఘటనలు చూసి తాను బాధపడుతున్నానని ఆయన బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. వర్మ వైఖరి వల్ల పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అనవసర ఘర్షణలు తలెత్తుతున్నాయని నివేదికలు అందడంతో, ఇక ఆలస్యం చేయకుండా ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి కొత్త కమిటీకి పగ్గాలు అప్పగించాలని బాబు నిర్ణయించారు.

    వర్మను తప్పించిన తర్వాత పిఠాపురం టీడీపీలో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. త్వరలో ఏర్పాటు చేయబోయే ప్రత్యేక కమిటీలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్‌తో కలిసి నడిచే, వివాదరహిత నేతలకే ఈ కమిటీలో ప్రాధాన్యత ఉండబోతున్నట్లు సమాచారం. మరి పార్టీ తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయంపై వర్మ ఎలా స్పందిస్తారో, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.