Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు సినిమాలలో నటిస్తున్న వాళ్ళను చూస్తుంటే కోట శ్రీనివాసరావు గారు ఆవేదన నిజమే అనిపిస్తుంది. కరోనా తర్వాత బాలీవుడ్ కంటే టాలీవుడ్ సినిమాదే పెద్ద మార్కెట్ అయింది. ఎస్ ఎస్ రాజమౌళి, సుకుమార్, సుజీత్, చందు మొండేటీ లాంటి దర్శకులు ఇచ్చిన సక్సెస్ మన తెలుగు సినిమా రేంజ్ ని అమాంతం ఆకాశానికి ఎత్తాయి.
ఇప్పుడు హిందీ సినిమా ఏదీ కూడా మన సౌత్ సినిమాలను టచ్ చేయలేకపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే హిందీ బెల్ట్ లో సినిమాలు తీయాలనుకున్న పెద్ద పెద్ద మేకర్స్ అందరూ తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపే చూస్తున్నారు. అసలు వీళ్లకి ఈ సక్సెస్ ఎలా సాధ్యమవుతుందీ అని. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్, పుష్ప సిరీస్, సలార్ లాంటి సినిమాలు చూసి బాలీవుడ్ మేకర్స్ లో కొంత అసహనం మొదలైన మాట ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.

Tollywood Cinema: రానా దగ్గుబాటి ఉండనే ఉన్నారు
అందుకే, కాబోలు హిందీలో ఒకప్పుడు స్టార్ హీరోలుగా వెలిగిన సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్, సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు తెలుగు సినిమాలో అవకాశం వస్తే బావుండు అని ఆశపడుతున్నారు. నిన్నా మొన్నటి వరకూ ముంబై నుంచి హీరోయిన్స్ ని మాత్రమే తీసుకొచ్చి మన తెలుగమ్మాయి లని అంతగా పట్టించుకోరనే వాదన ఉంది.
ఇప్పుడు క్యారెక్టర్స్ కోసం అక్కడి వారిని తీసుకోవడం ఒక టాపిక్ అయిపోయింది. దీనికి బాలీవుడ్ లో సినిమా రిలీజ్ చేస్తే బిజినెస్ అవుతుందనేది ఒక కారణం..అలాగే, ఇక్కడ ప్రేక్షకులకి కొత్తదనం ఉంటుందనేది ఇంకో కారణం అయితే, ఇటీవల కాలంలో మన స్టార్ హీరోలకి బాలీవుడ్ నటీ నటులతో ఏర్పడిన పర్సనల్ రాపో మరో కారణం కావచ్చు. ఇలా ఎన్నో కారణాలున్నప్పటికీ వారికి దక్కుతున్న పాత్రల్లో మాత్రం దమ్ముండటం లేదు.

ఆమాత్రం పాత్రలు మన వాళ్ళలో చేసే సత్తా లేదా.? అంటే దీనికి సమాధానం ఖచ్చితంగా దర్శకులే చెప్పాలి. ఆ మధ్య వచ్చిన దేవర సినిమాలో సైఫ్ అలీఖాన్ నటిస్తే ఆ పాత్ర ఎవరికీ నచ్చలేదు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్ లోనూ బాబీ డియోల్ నటించాడు. తెరమీద ఏదో భాష అర్థం కాక సీరియస్ గానో లేక డైలీ సీరియల్ కి కన్నడ నటీనటులకి ప్రాంటింగ్ చెప్పినట్టు ఇక్కడ డైలాగులు హిందీలో చెప్తుంటే దానికి తగ్గట్టుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినట్టుగానో ఉంది తప్ప నిజంగా పాత్రను అర్థం చేసుకొని నటించినట్టు అయితే లేదు.
ఎప్పుడూ కోట శ్రీనివాసరావుగారు మదనపడుతున్నట్టు ‘భాష రానివాడిని తీసుకొచ్చి కెమెరా ముందు నుంచోపెడితే వాడేం నటిస్తాడండీ..పిచ్చి చూపులు చూస్తుంటాడు..దర్శకులకి తెలియాలి కదా..ఏ పాత్ర ఎవరు వేస్తే న్యాయం చేగలరో..ఏదో తీస్తున్నారంటే తీస్తున్నారు’..అన్నట్టు నిజంగా అనిపిస్తోంది. తమిళ నటుడు అరవింద స్వామీ ఈ విషయంలో గ్రేట్ అని చెప్పాలి. అలాగే, సముద్ర ఖనీ, మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి వారూ పర్వాలేదు. ఎందుకంటే మన సౌత్ భాషల మీద వీరికి కొంత అవగాహన ఉంది కాబట్టి. హిందీ నటుల్లో మాత్రం అది కొరవడిందని చెప్పక తప్పదు.

దేవర సినిమాలో సైఫ్ చేసిన పాత్రకి గానీ, డాకూ మహారాజ్ లో బాబీ డియోల్ చేసిన పాత్రకి గానీ మన తెలుగు నటుల్లో రానా దగ్గుబాటి ఉండనే ఉన్నారు. పాపం ఈ మధ్య ఆయన కూడా నన్నెవరూ తీసుకోవడం లేదనే అసహనాన్ని వ్యక్తపరచారు. ఆయనొక్కరే కాదు, జే డీ చక్రవర్తి, జగపతి బాబు, గోపీచంద్, శ్రీకాంత్ వంటి పాపులర్ యాక్టర్స్ మాత్రమే కాకుండా కొత్తగా అవకాశాల కోసం వెంపర్లాడుతున్న వారూ ఉన్నారు. కానీ, మనవాళ్ళ చూపూ మాత్రం అటే వెళ్తోంది. బహుషా అక్కడ మన తెలుగు సినిమా ఆడాలంటే వాళ్ళుండాలనే లాజిక్కేమో మరి.