TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతూ ఉంటాయి. అయితే తిరుమలలో స్థానిక ఆలయాల బ్రహ్మోత్సవాలు త్వరలోనే జరగబోతున్న నేపథ్యంలో అందుకు అని ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేసింది. ఇందులో భాగంగానే బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి నగలను సమర్పించడం గత దశాబ్దాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే నారాయణ వనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ఏకంగా 33 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను సమర్పించారు.
ఇలా బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి ఆలయం నుంచి కల్యాణ వెంకటేశ్వర స్వామికి నగలను పంపించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే స్వామివారి ఆలయం నుంచి నారాయణ వనంకు పంపించిన ఆభరణాలలో శీమ కమలాలు, నవరత్న పూసలతో కూడిన రెండు పేటల బంగారు హారం, బంగారు లక్ష్మీకాసుల మాల ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం తరఫున ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఈ ఆభరణాలను నారాయణవనం ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నకు అందజేశారు.
శ్రీవారి ఆలయం నుంచి నారాయణవనం ఈ ఆభరణాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి, మూలమూర్తి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అలంకరించారు. ప్రతి ఏడాది ఇలా కళ్యాణ శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారి ఆలయం నుంచి నగలను పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, తిరుమల బొక్కసం ఇన్‌చార్జి శ్రీ గురురాజస్వామి, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి వంటి తదితరులు పాల్గొన్నారు.

