TDP PARTY: తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ ‘మహానాడు’ సరికొత్త హంగులతో, సరిహద్దులు దాటిన ఉత్సాహంతో ప్రారంభమైంది. ఏటా పసుపు దండుతో ఏదో ఒక ప్రాంతం కిక్కిరిసిపోయేలా జరిగే ఈ వేడుకను, ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా, అంతకంటే వినూత్నంగా నిర్వహిస్తున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ఒకడుగు ముందే ఉండే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈసారి సరికొత్త సంప్రదాయానికి తెరలేపారు. ఈ ఏడాది మహానాడులో ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్న మెయిన్ హైలెట్స్ ను పరిశీలిస్తే..
ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును చంద్రబాబు నాయుడు ఆచరణలో పెట్టారు. లక్షలాది మంది ఒకే చోటికి ప్రయాణించే శ్రమను, ఖర్చును తగ్గిస్తూ ఈసారి మహానాడును పూర్తిగా హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యుల సమక్షంలో ప్రధాన వేడుక జరుగుతుండగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్లస్టర్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్ల ద్వారా కార్యకర్తలు ఈ వేడుకను ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు. టెక్నాలజీని వాడుకోవడంలో చంద్రబాబు విజన్‌కు ఈ హైబ్రిడ్ మోడల్ మరో నిదర్శనంగా నిలిచింది.

TDP PARTY: టీడీపీ మూడు తరాల వైభవానికి ప్రతీకగా
ఈ మహానాడుకు పార్టీ శ్రేణుల్లో ఇంతటి జోష్ రావడానికి మరో ముఖ్య కారణం.. మంత్రి నారా లోకేష్. ఆయన పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి మహానాడు ఇదే కావడంతో తమ్ముళ్లలో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీని భవిష్యత్తు వైపు నడిపించే మూడో తరం నాయకుడిగా లోకేష్ బాధ్యతలు అందుకున్న తరుణంలో.. ఈ వేడుకలు పార్టీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనున్నాయి.
అదేవిధంగా ఈసారి మహానాడుకు అత్యంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది విజయవాడ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఏర్పాటు చేసిన భారీ కటౌట్. మంగళగిరి సమీపంలోని కృష్ణా నది తీరాన, సీతమ్మ వారి పాదాల చెంత ఏకంగా 150 అడుగుల ఎత్తుతో ఈ కటౌట్‌ను నిర్మించారు. టీడీపీ మూడు తరాల వైభవానికి ప్రతీకగా.. నందమూరి తారకరామారావు, నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్‌ల చిత్రాలతో కూడిన ఈ కటౌట్ కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకుంటోంది. దాదాపు రూ.18 లక్షల భారీ వ్యయంతో రూపొందించిన ఈ కటౌట్, ఈ ఏడాది మహానాడుకే హైలైట్.

