Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత మరల రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న జనసేనాని వాటికి కొంత గ్యాప్ ఇచ్చి రైతులకి భరోసా ఇవ్వడం కోసం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటన జరగనుంది. ఈ పర్యటనలో భాగంగా పోలవరం నిర్వాసితులని కూడా కలుసుకోనున్నారు. గత కొద్ది రోజులుగా భారీ వర్షాల కారణంగా రబీ సాగులో ఉన్న చాలా పంట దెబ్బతింది. ఆరబెట్టిన ధాన్యం ఆకస్మికంగా పడిన వర్షాలకి తడిసిపోయాయి. రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న ప్రత్యక్షంగా మాత్రం జరగడం లేదనేది విపక్షాల ఆరోపణలు.
ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత మరల కొద్దిగా యాక్టివ్ అయ్యి వర్షాలకి పంటలు నష్టపోయిన రైతులని పరామర్శించడానికి వస్తున్నారు. రైతులకి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో భరోసా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సుమారు రెండు నెలల తర్వాత జనసేనాని ప్రజల్లోకి వస్తుండటంతో ఏం మాట్లాడుతారు అనే విషయంపై రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది. అలాగే పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి పర్యటన వెనుక రైతులని పరామర్శించడం అనేది జెండా అయినా కూడా అసలైన అజెండా వేరే ఉందనే మాట వినిపిస్తోంది.
కాపు సామాజిక వర్గం ఓటర్లని ప్రభావితం చేయాలంటే గోదావరి జిల్లాలపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ క్యాడర్ ని సమాయత్తం చేసే ఉద్దేశ్యంతోనే ఈ పర్యటన కొనసాగాబోతుంది అనే మాట రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడకుండానే విమర్శలు చేసే వైసీపీ నాయకులకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాక మరింతగా విమర్శలు చేసే అవకాశం కల్పించిందని చెప్పాలి.