Pawan Kalyan: తెలుగు సినిమా రంగంలో పవర్ స్టార్‌గా గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్, గత దశాబ్ద కాలంగా రాజకీయ రంగంలో తన స్థానాన్ని ఏర్పరుచుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రశ్నించాలనే ధ్యేయంతో రాజకీయాల్లోకి వచ్చానని ఎన్నోసార్లు చెప్పిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు తానే ప్రజల ప్రశ్నలకు గురవుతుండటం అనేక విమర్శలకు దారి తీస్తోంది.
చిరకాలంగా విప్లవాత్మక భావజాలాన్ని, ముఖ్యంగా చేగువేరా వంటి నాయకులని ఆదర్శంగా చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు పూర్తిగా భిన్నమైన దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఎక్కువగా కాషాయ వస్ర్తాలలో కనిపిస్తూ, సనాతన ధర్మంపై ప్రసంగాలు చేస్తూ, హిందూ ధర్మాన్ని సంరక్షించాలన్న శబ్దాలతో రాజకీయ వేదికలపై మాట్లాడుతున్నారు.

Pawan Kalyan: కాషాయ దుస్తులు ధరించడంలో తప్పేమీ లేదు.
కాషాయ దుస్తులు ధరించడంలో తప్పేమీ లేదు. కానీ కాషాయానికి ఉన్న ఆత్మీయత, త్యాగం, ఆత్మనిగ్రహం వంటి విలువలకు అనుగుణంగా నడుచుకోవడంలోనే దాని మౌలికత ఉంటుంది. కాషాయ వస్ర్తధారణ అంటే భౌతిక విలాసాలను త్యజించడమే కాదు, అహంకారాన్ని పారద్రోలటం, సంయమనాన్ని పాటించటమూ కూడా. కానీ పవన్ కళ్యాణ్ ఇటీవలి వ్యాఖ్యలు ఈ విలువలకు విరుద్ధంగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి.
ఇటీవల “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. “తొక్కి నార తీస్తాం, మక్కికి మక్కి తీసి మూలన కూర్చోబెడతాం” వంటి మాటలు ఒక ప్రజాప్రతినిధికి ఏమాత్రం తగవు. అధికారంలో ఉన్న వ్యక్తి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ ఆ చర్యల గురించి ఉద్దేశపూర్వకంగా ప్రజలను భయపెట్టే విధంగా మాట్లాడటం ప్రజాస్వామ్య పరంగా సమంజసం కాదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఇంతకముందు కూడా పవన్ కళ్యాన్ రెచ్చగొట్టే రీతిలో మాట్లాడటం, ప్రత్యర్థులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం చూసిన ప్రజలు, ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ రకమైన భాషా ప్రదర్శన ఎలా న్యాయంగా భావించాలో అని అనుకోవడం సహజం. ఒకవేళ ఇది సనాతన ధర్మం నేర్పిన సంస్కారమా? అని ప్రశ్నించకుండా ఉండలేరు.
పవన్ కళ్యాణ్ ఒకవైపు జ్ఞానం, ధర్మం, నైతికత గురించి ప్రసంగిస్తుంటే, మరోవైపు రాజకీయ వేదికలపై కసాయి భాష వినిపించడం ఆయన ద్వంద్వ వైఖరిని సూచిస్తోందని విమర్శకులు అంటున్నారు. ఒకవేళ పవన్ గారు నిజంగా సనాతన ధర్మాన్ని గౌరవిస్తే, ఆయన మాటలు, చేతలు, నడవడికలు కూడా అదే ధర్మానికి తగినవిగా ఉండాలి.
పాలకుడిగా ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడు, ప్రౌఢమైన భాష, దూషణలు, బెదిరింపుల మాటలు వాడితే అది ప్రజాస్వామ్యంలో భయపెట్టే పాలనకు దారితీయవచ్చు. ప్రజలలో నమ్మకాన్ని పొందాలంటే అభివృద్ధి, ఆచరణ, మరియు విధేయత వంటి అంశాలు ముఖ్యం. మాటల్లో శాంతి, చర్యల్లో క్రమశిక్షణ ఉన్నప్పుడే నాయకత్వం అర్థవంతంగా నిలుస్తుంది.