Jet Crashes: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరంలోని ఉత్తర భాగంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ భవనంపై బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఈ ఘటనలో 16 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు, పైలట్ మహమ్మద్ తౌకిర్ ఇస్లాం సహా మొత్తం 19 మంది మృతి చెందారు. 100 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రమాదానికి గురైన విమానం చైనా తయారీ F-7BGI అనే శిక్షణ జెట్. ఇది మధ్యాహ్నం 1:06 గంటలకు శిక్షణ ప్రయాణానికి బయలుదేరగా, కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. ఆ వెంటనే కంట్రోల్ కోల్పోయిన విమానం నేరుగా పాఠశాల భవనంపై పడిపోయింది. ఈ ప్రమాదం సమయంలో తరగతులు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా నమోదైంది. ఘటనా స్థలాన్ని భారీ మంటలు, పొగలు కమ్ముకున్నాయి. ఆ భాగంలోని విద్యార్థులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన సహాయక బృందాలు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడినవారిని స్థానిక ఆసుపత్రులకు తరలించాయి.
ఈ దుర్ఘటన బంగ్లాదేశ్‌ను తీవ్ర విషాదంలో ముంచింది. తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ ఈ ఘటనపై స్పందిస్తూ “దేశానికి తీరని నష్టం” అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేసారు. బాధితులకు ప్రభుత్వం అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.

Jet Crashes: ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని అధికారులు భావిస్తున్నప్పటికీ,
ప్రాథమికంగా ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని అధికారులు భావిస్తున్నప్పటికీ, స్పష్టతకు మరింత విచారణ అవసరమని తెలిపారు. సైనిక విమానాలు జనసాంద్రత గల ప్రాంతాల్లో శిక్షణ జరపడం ఎంతవరకు సురక్షితం అన్నదానిపై ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ ప్రమాదం ఫలితంగా మైల్‌స్టోన్ స్కూల్ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. 2,000 మంది విద్యార్థులు చదువుతున్న ఈ విద్యాసంస్థ ఇప్పుడు విషాద ఛాయల్లో మునిగిపోయింది. దేశవ్యాప్తంగా ప్రార్థనలు, సంతాప సభలు జరుగుతున్నాయి. ఈ ఘటన విమాన భద్రత, తగిన జాగ్రత్తలపై అంతర్జాతీయంగా కూడా కొత్తగా చర్చలు ప్రారంభమయ్యేలా చేసింది.

