ప్రస్తుతం పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాను దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బ్యారెల్ ధర ఏకంగా 126 డాలర్లకు చేరుకోవడంతో భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది పెద్ద దెబ్బ. మనం కొనే పెట్రోల్, డీజిల్‌కు డాలర్లలో చెల్లించాలి. ఒకవైపు చమురు కోసం భారీగా డాలర్లు ఖర్చు చేస్తున్న తరుణంలో, మళ్ళీ బంగారం కోసం కూడా బిలియన్ల కొద్దీ డాలర్లను విదేశాలకు పంపితే మన దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వలు నిండుకుంటాయి. ఇదే మోదీ ఆందోళనకు ప్రధాన కారణం.

Narendra Modi: బంగారం కొనవద్దంటే పెట్టుబడి పెట్టవద్దని అర్థం కాదు.
మనం ఎంత ఎక్కువ బంగారం దిగుమతి చేసుకుంటే, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు అంత డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా మన రూపాయి విలువ పడిపోతుంది. రూపాయి బలహీనపడితే మనం వాడే నిత్యావసరాల ధరలన్నీ పెరిగిపోతాయి. అంటే, ఒక సామాన్యుడు కొనే ఒక చిన్న బంగారు ఉంగరం కూడా పరోక్షంగా దేశంలో ధరల పెరుగుదలకు కారణమవుతోందని ఆర్థికవేత్తల వాదన. అందుకే, దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకు ప్రజలు తమ వ్యక్తిగత ఇష్టాలను పక్కన పెట్టి, దేశ ప్రయోజనాల కోసం పసిడి కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.
బంగారం కొనవద్దంటే పెట్టుబడి పెట్టవద్దని అర్థం కాదు. భౌతిక రూపంలో బంగారం (బిస్కెట్లు, కాయిన్లు) కొని లాకర్లలో దాచడం వల్ల దేశానికి ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం ఉండదు. దానికి బదులుగా సావరిన్ గోల్డ్ బాండ్ల వైపు మళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మీకు బంగారం ధర పెరిగిన లాభం వస్తుంది, పైగా అదనపు వడ్డీ కూడా దక్కుతుంది. ప్రధాని పిలుపు వెనుక ఉన్న ఉద్దేశం.. ప్రజల పొదుపును అడ్డుకోవడం కాదు, ఆ పొదుపు దేశాభివృద్ధికి ఉపయోగపడేలా చూడటం.
పెళ్లిళ్లు, శుభకార్యాల వేళ ఈ నిర్ణయం కఠినంగా అనిపించినా, దేశం ఒక ఆర్థిక విపత్తు వైపు వెళ్లకుండా ఉండాలంటే ఇది తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. ముడి చమురు ధరలు శాంతించే వరకు భారతీయులు తమ బంగారు కోరికలను కాస్త అదుపులో ఉంచుకుంటే, అది రూపాయి బలానికి, దేశ ఆర్థిక భద్రతకు పెద్ద మద్దతుగా నిలుస్తుంది.

