Technology: భారత మొబైల్ వినియోగదారులకు శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సౌకర్యం మరింత సమీపంలోకి వచ్చింది. వొడాఫోన్ ఐడియా (Vi) తాజాగా అమెరికా కేంద్రంగా ఉన్న శాటిలైట్ కంపెనీ AST SpaceMobileతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎలాంటి అదనపు పరికరాలు లేకుండా స్మార్ట్‌ఫోన్లకే నేరుగా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించనున్నారు.
ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ అనేది ప్రపంచంలో మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత సెల్యులార్ నెట్‌వర్క్ అందిస్తున్న సంస్థ. ఇది ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ ‘స్టార్‌లింక్’కి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. అయితే స్టార్‌లింక్ సేవలను ఉపయోగించాలంటే ప్రత్యేక టెర్మినల్స్ కొనాల్సి వస్తుంది. అదే సమయంలో AST స్పేస్‌మొబైల్ మాత్రం ప్రత్యేక హార్డ్‌వేర్ అవసరం లేకుండా మొబైల్ ఫోన్లకే నేరుగా కనెక్టివిటీని అందించనుంది.
వొడాఫోన్ ఐడియా ఈ భాగస్వామ్యాన్ని “దేశంలోని కనెక్టివిటీ లేని ప్రాంతాలను విస్తరించేందుకు” కీలకంగా అభివర్ణించింది. ఈ భాగస్వామ్యం ద్వారా, వాయిస్, వీడియో కాల్స్, ఇంటర్నెట్ సేవలు నేరుగా అంతరిక్షం నుంచి ఫోన్‌కు వస్తాయి. ఎలాంటి యాప్‌లు లేదా కొత్త సెట్టింగ్స్ అవసరం లేదు. ఇది ప్రత్యేకత.

Technology: వొడాఫోన్ ఐడియా ఇంకా ప్రకటించలేదు
AST స్పేస్‌మొబైల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ క్రిస్ ఐవరీ మాట్లాడుతూ, “భారత్ వంటి టెలికాం మార్కెట్‌లో మా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సాంకేతికతను పరీక్షించేందుకు ఇది అత్యుత్తమ వేదిక. ఈ సాంకేతికతతో కనెక్టివిటీపై ఉన్న అడ్డంకులను తొలగించవచ్చు. నేరుగా 4జీ, 5జీ సేవలను అందిస్తాం,” అని తెలిపారు.
వీరి సేవలు మొదలయ్యే తేదీని వొడాఫోన్ ఐడియా ఇంకా ప్రకటించలేదు. అయితే కంపెనీ ప్రతినిధి ప్రకారం, “సరైన సమయంలో అన్ని వివరాలు వెల్లడిస్తాం,” అని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై వొడాఫోన్ పీఎల్‌సీ, AST స్పేస్‌మొబైల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇతర శాటిలైట్ ఇంటర్నెట్ ప్లేయర్లలో ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఇప్పటికే DOT నుంచి లైసెన్సు పొందింది. అయితే ఇది ప్రత్యేక టెర్మినల్ పరికరాలతో మాత్రమే పని చేస్తుంది. స్టార్‌లింక్‌తో జియో మరియు భారతీ ఎయిర్‌టెల్ భాగస్వామ్యాలు కూడా ఉన్నాయ్. కానీ, AST నెట్‌వర్క్ ప్రత్యేకత ఏమిటంటే, ఎటువంటి అదనపు గ్యాడ్జెట్‌లు లేకుండా నేరుగా స్మార్ట్‌ఫోన్లకే కనెక్టవవుతుంది.
ఈ పరిణామం ఎందుకు అంటే.. భారతదేశంలోని దూర ప్రాంతాలకూ కనెక్టివిటీ కల్పించవచ్చు. సహజ విపత్తుల సమయంలో విపరీతంగా ఉపయోగపడుతుంది. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసే అవకాశం ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే.. త్వరలోనే మన స్మార్ట్‌ఫోన్లు, భూమిపై ఉన్న సెల్ టవర్స్‌ను కాదు, నేరుగా ఆకాశంలో ఉన్న శాటిలైట్లను కనెక్ట్ అవుతాయి. ఇది కనెక్టివిటీ విప్లవానికి నాంది కావొచ్చు.