AP POLITICS: ఆంధ్రప్రదేశ్ అడవుల్లో మళ్లీ పులుల గర్జనలు మిన్నంటబోతున్నాయా? నల్లమల అడవులకు పూర్వవైభవం రాబోతోందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రానికి ఒక ఊహించని, అత్యంత ఆసక్తికరమైన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అంతరించిపోతున్న పులుల సంతతిని మళ్లీ గాడిలో పెట్టేందుకు ఏకంగా ఆరు ఆడపులులను ఆంధ్రప్రదేశ్‌కు పంపాలంటూ కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరారు. పవన్ చేసిన ఈ క్రేజీ రిక్వెస్ట్ ఇప్పుడు రాజకీయ, వన్యప్రాణి వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
నల్లమల వైభవం కోసం ‘టైగర్’ ప్లాన్!
ఒకప్పుడు నల్లమల అడవులు వన్యప్రాణులకు, ముఖ్యంగా పులులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవి. కానీ, కాలక్రమేణా అడవుల ఆక్రమణలు, రహదారుల నిర్మాణం, మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ఇక్కడ పులుల సంఖ్య దారుణంగా పడిపోయింది. ఈ సంక్షోభాన్ని గుర్తించిన పవన్ కల్యాణ్.. పులుల సంతతిని వేగంగా పెంచేందుకు ఒక పక్కా వ్యూహాన్ని సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే మహారాష్ట్ర నుండి నాలుగు, మధ్యప్రదేశ్ నుండి రెండు ఆడపులులను ఏపీకి రప్పించాలని ప్లాన్ చేశారు. ఈ ఆడపులుల ద్వారా ఏపీలో పులుల జనాభాను పెంచి, భవిష్యత్తులో ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు పులులను సరఫరా చేసేలా ఒక బృహత్తర లక్ష్యాన్ని కేంద్రం ముందుంచారు.

AP POLITICS: ఏపీ అటవీ ప్రాంతాల భద్రతపై పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు
కేంద్ర మంత్రితో జరిగిన ఈ భేటీలో కేవలం పులుల గురించే కాకుండా, ఏపీ అటవీ ప్రాంతాల భద్రతపై పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు చేశారు. శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో నిఘాను పటిష్టం చేసేందుకు బేస్ క్యాంపుల సంఖ్యను పెంచాలని, అందుకోసం కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. దీనికి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కూడా సానుకూలంగా స్పందించడం విశేషం. దీనితో పాటు చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఏనుగుల దాడుల నివారణకు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ హనుమాన్ వివరాలను కూడా పవన్ కేంద్రానికి వివరించారు.
గతంలో కర్ణాటక నుండి ‘కుంకీ’ ఏనుగులను రప్పించి, స్థానిక ఏనుగులకు ఎలాంటి హాని కలగకుండా అడవుల్లోకి తోలేలా పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు అదే బాటలో అడవుల రక్షణతో పాటు, వన్యప్రాణుల సంరక్షణే ధ్యేయంగా ఆయన అడుగులు వేస్తున్నారు. పవన్ కల్యాణ్ చేసిన ఈ తాజా విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం.. త్వరలోనే మహారాష్ట్ర, బెంబేల పులులు ఆంధ్రా అడవుల్లో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

