TTD: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కొన్ని కీలక సూచనలు చేశారు. తిరుమలలో సెప్టెంబర్ నెలలో బ్రహ్మోత్సవాలు జరగబోతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన షెడ్యూల్ కూడా టీటీడీ విడుదల చేశారు .మరి కొద్ది రోజులలో బ్రహ్మోత్సవాలు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు.
ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు కొన్ని సేవలను రద్దు చేస్తున్నట్లు తాజాగా తెలియజేశారు.టీటీడీ ప్రకటన ప్రకారం.. సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 9 రోజుల పాటు ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన సేవ, తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు టీటీడీ రద్దు చేస్తున్నట్టు టీటీడీ పేర్కొంది. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్టు తెలియజేశారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని భక్తులు సహకరించాలని కోరారు.

TTD: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..
బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది అయితే భక్తులకు త్వరగా స్వామి వారి దర్శనం కలిగేలా ఏర్పాటు చేయడంలో భాగంగానే ఈ సేవలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలియజేశారు. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ సేవలు అన్నింటిని పూర్తిగా నిలిపివేయడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు వీటిని గమనించి అందుకు అనుగుణంగా సహకరించాలని కోరారు. అదేవిధంగా ఆగస్టు 17 నుంచి 19 వరకు టీటీడీలో వస్త్రాల ఈ-వేలం జరగనున్నట్టు తెలిపింది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఆగస్టు 17 నుంచి 19 వరకు వేలం వేయనున్నట్లు తెలియజేశారు.

