Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి, ఇప్పుడు సొంత కేబినెట్ సహచరురాలి నుంచే గట్టి సవాల్ ఎదురవుతోంది. సీనియర్ నాయకురాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శైలి ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. కేబినెట్‌లో కీలకమైన బీసీ మహిళా ముఖంగా ఉన్న తనకు, ప్రభుత్వ పెద్దల నుంచి ఆశించిన స్థాయిలో గౌరవం, స్వేచ్ఛ లభించడం లేదనే అసహనంతో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు కావాలనే తనను పక్కనబెడుతున్నారనే అనుమానాలు ఆమెను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి.
ముఖ్యంగా వరంగల్ జిల్లాలో పాత, కొత్త నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఈ వివాదానికి ప్రధాన కేంద్రంగా మారింది. కాంగ్రెస్ గూటికి చేరిన కడియం శ్రీహరి దూకుడు, మంత్రి సురేఖకు అస్సలు నచ్చడం లేదు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే హోదాలో కడియం తీసుకుంటున్న సొంత నిర్ణయాలు శాఖా మంత్రిగా ఉన్న సురేఖకు మింగుడుపడటం లేదు. ప్రోటోకాల్‌ను కాదని, కనీసం మంత్రికి ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా అధికారులతో సమీక్షలు నిర్వహించడం, ఆర్డర్లు వేయడం కొండా వర్గాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది.

Telangana: రేవంత్ రెడ్డి సర్కార్‌పై అలకబూనిన కొండా సురేఖ
ఈ మంటకు నెయ్యి పోసినట్లుగా యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు నియామకం వ్యవహారం మరింత వివాదాస్పదమైంది. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటులో దేవాదాయ మంత్రి పాత్ర దాదాపు శూన్యమనే ప్రచారం సాగుతోంది. సీఎం కార్యాలయం, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఒకరిద్దరు హేమాహేమీల లీడ్‌లోనే ఈ లిస్ట్ ఫైనల్ అయిందనే టాక్ వినిపిస్తోంది. సొంత శాఖలో ఇంత పెద్ద ప్రక్రియ జరుగుతున్నా తానొక రబ్బర్ స్టాంప్‌లా మిగిలిపోవాల్సి రావడంపై సురేఖ తీవ్రంగా నొచ్చుకున్నట్లు సమాచారం. ఈ ఆవేదనతోనే ఆమె ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారనే ప్రచారం నడుస్తోంది.
ఇప్పటికే ఒకసారి రేవంత్ రెడ్డి సర్కార్‌పై అలకబూనిన కొండా సురేఖను అప్పట్లో పెద్దలు నచ్చజెప్పారు. కానీ, ఈసారి పరిస్థితి హద్దులు దాటినట్లు కనిపిస్తోంది. తన ఆత్మగౌరవానికి భంగం కలుగుతోందని భావిస్తున్న ఆమె, ఈసారి రాష్ట్ర నాయకత్వంతో కాకుండా నేరుగా ఏఐసీసీ పెద్దల వద్దే పంచాయతీ పెట్టాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానానికి తన గోడును వివరిస్తూ ఒక ఘాటు లేఖ రాయడానికి ఆమె గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మరి రేవంత్ రెడ్డి ఈ కొండా వివాదాన్ని ఎలా చక్కదిద్దుతారో చూడాలి.

