Tue. Jul 7th, 2026

    Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ అడ్వెంచర్ ‘విశ్వంభర’ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ మొదలై ఏళ్లు గడుస్తున్నా, ఇంకా థియేటర్ల వరకు రాకపోవడంతో సహజంగానే సినిమాపై ఉన్న బజ్ కొద్దిగా తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను మళ్లీ వార్తల్లోకి తెచ్చి, అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లడం చిత్ర యూనిట్‌కు అత్యంత అవసరం. దీనికోసం చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి భారీ ప్రమోషన్ ప్లాన్స్ సిద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడంతో పాటు, రిలీజ్ విషయంలో మెగాస్టార్ ముందు ఇప్పుడు ఊహించని సవాళ్లు వచ్చి పడ్డాయి.

    ప్రస్తుతం మేకర్స్ కన్ను దసరా పండగ సీజన్‌పై పడింది. ఎలాగైనా అక్టోబర్ కానుకగా సినిమాను థియేటర్లలోకి దించాలని చూస్తున్నారు. కానీ, అక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. అక్టోబర్ మధ్యలో రజనీకాంత్ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ వస్తున్నట్లు టాక్. ఒకవేళ రజనీతో నేరుగా తలపడితే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ముఖ్యంగా తమిళనాడు, కేరళ వంటి పక్క రాష్ట్రాలలో ‘విశ్వంభర’కు థియేటర్లు దొరకడం గగనమైపోతుంది. కర్ణాటకలో మేనేజ్ చేసినా, బాక్సాఫీస్ వసూళ్లపై ఆ ప్రభావం గట్టిగానే పడుతుంది. రజనీకాంత్ క్రేజ్, పైగా ‘జైలర్’ మొదటి భాగానికి తెలుగులో వచ్చిన రెస్పాన్స్ చూస్తే.. ఈ క్లాష్‌ను వదులుకోవడం అంత సురక్షితం కాదు.

    chiranjeevi-these-are-the-challenges-facing-viswambhara
    chiranjeevi-these-are-the-challenges-facing-viswambhara

    Chiranjeevi: ‘విశ్వంభర’ అద్భుతంగా ఉన్నా కూడా కలెక్షన్లను పంచుకోవాల్సి వస్తుంది. 

    సరే రజనీకాంత్‌తో పోటీ ఎందుకని కాస్త ముందుకు జరిగి అక్టోబర్ మొదటి వారంలో వద్దామనుకుంటే.. అక్కడ విక్టరీ వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ సినిమాతో అప్పుడే కర్చీఫ్ వేసి కూర్చున్నారు. గాంధీ జయంతి (అక్టోబర్ 2) వీకెండ్‌ను వెంకీ లాక్ చేసుకోవడంతో, ఆ సమయానికి రావడం కూడా రిస్కే. ఫ్యామిలీ ఆడియన్స్‌లో వెంకటేష్‌కు ఉన్న పట్టు మనకు తెలిసిందే. ఒకవేళ ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రెండు మూడు వారాల పాటు థియేటర్లను హోల్డ్ చేస్తుంది. అప్పుడు ‘విశ్వంభర’ అద్భుతంగా ఉన్నా కూడా కలెక్షన్లను పంచుకోవాల్సి వస్తుంది. అలాగని అక్టోబర్ చివరకు వెళ్తే దసరా సెలవుల అడ్వాంటేజ్ చేజారిపోతుంది.

    ప్రస్తుతానికైతే విజువల్ ఎఫెక్ట్స్ పనులు ముగిసి, అవుట్‌పుట్ సంతృప్తికరంగా వచ్చినట్లు ఇన్సైడ్ టాక్. ఇక‌ ఆగస్ట్ 22న రాబోయే మెగాస్టార్ బర్త్‌డే రోజున ‘విశ్వంభర’ విడుదల తేదీపై ఒక పక్కా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ ముక్కోణపు పోటీని తట్టుకుని మెగాస్టార్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో చూడాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.