AP Politics: రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు సహజం. అయితే ప్రత్యర్థులు ఆడే మైండ్‌గేమ్‌ను తిప్పికొట్టడంలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూటే వేరు. ఇటీవల పార్టీ ‘ఉద్యమి ఆత్మీయ సమావేశం’లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా పొరుగు రాష్ట్ర రాజకీయాలతో, అందులోనూ తమిళనాడులో నటుడు విజయ్ పెట్టిన పార్టీతో జనసేనను పోలుస్తూ వైసీపీ చేస్తున్న విమర్శలపై పవన్ కళ్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. పరిస్థితులను, క్షేత్రస్థాయి వాస్తవాలను అర్థం చేసుకోకుండా మాట్లాడేవారికి తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
తమిళనాడు రాజకీయ వాతావరణానికి, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులకు నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. “పక్క రాష్ట్రంలో ఒకరు పార్టీ పెట్టారు.. రాగానే గెలిచారు.. నువ్వు కూడా అలాగే చేసి ఉండాల్సింది” అంటూ కొందరు మేధావులు ఉచిత సలహాలు ఇస్తున్నారని, కానీ ఇక్కడి గ్రౌండ్ రియాలిటీ వేరని ఆయన గుర్తుచేశారు. ఏపీలో రాజకీయాలు చేయడమంటే అంత సులువు కాదని, తాను ఇక్కడ దశాబ్ద కాలంగా ఎన్నో ఆవాంతరాలను, అవమానాలను తట్టుకుని నిలబడ్డానని పవన్ కళ్యాణ్ భావోద్వేగంతో పంచుకున్నారు.

AP Politics: నిన్నగాక మొన్న వచ్చిన పార్టీలతో పోల్చవద్దని హితవు పలికారు.
ఈ ప్రయాణంలో తాను ఎదుర్కొన్న కష్టాలను పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అధికారం, అంగబలం ఉన్న ఎందరో రౌడీ మూకలను ఒంటరిగా ఎదుర్కొని, గుండె నిబ్బరంతో రాజకీయాల్లో కొనసాగానని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైనప్పుడు, తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయినప్పుడు.. సొంత మనుషులే తనను వదిలేసి వెళ్ళిపోయారని గుర్తుచేసుకున్నారు. అలాంటి శూన్యంలో కూడా అధైర్యపడకుండా, ఒంటరి పోరాటం చేస్తూ పార్టీని ఈరోజు ఈ స్థాయికి తీసుకువచ్చానని చెప్పారు. అందువల్ల, దశాబ్ద కాలపు రక్తాన్ని, చెమటను ధారపోసి నిర్మించిన జనసేనను.. నిన్నగాక మొన్న వచ్చిన పార్టీలతో పోల్చవద్దని హితవు పలికారు.
కేవలం ఒక్కడితో, ఒక చిన్న ఆలోచనతో మొదలైన జనసేన ప్రస్థానం.. ఈరోజు 21.5 లక్షల మంది రిజిస్టర్డ్ సైనికులతో ఒక మహా శక్తిగా ఎదిగిందని పవన్ కళ్యాణ్ గర్వంగా ప్రకటించారు. కేవలం ఏపీ, తెలంగాణలకే పరిమితం కాకుండా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ సిద్ధాంతాలు నచ్చి సుమారు 10 వేల మందికి పైగా ఉద్యమి సభ్యత్వం తీసుకోవడం జనసేన ఎదుగుదలకు నిదర్శనమన్నారు. జనసేన అనేది కేవలం ఒక ప్రాంతీయ భావజాలం ఉన్న పార్టీ కాదని, దేశ సమగ్రతను ఆకాంక్షించే జాతీయ భావాలున్న పార్టీ అని స్పష్టం చేస్తూ.. విమర్శకుల నోళ్లు మూయించారు.

