Thu. May 14th, 2026

    Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి క్షేత్రస్థాయి కార్యాలయాల వరకు త్వరలోనే ఒక భారీ మార్పు రాబోతోంది. ఇన్నాళ్లూ ఉద్యోగులు ఉదయాన్నే ఫైళ్లతో ఆఫీసులకు పరుగులు తీసే సంప్రదాయానికి ఏపీ ప్రభుత్వం స్వస్తి పలకనుంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ వెసులుబాటు కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు.

    సాధారణంగా ఐటీ కంపెనీలకే పరిమితమైన ఈ ఇంటి నుంచే పని విధానాన్ని, ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లోనూ ప్రవేశపెట్టడం ద్వారా సరికొత్త పాలనా సంస్కరణకు శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపునకు స్పందించిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా, అనవసర ప్రయాణాలకు బ్రేక్ వేయాలని సర్కార్ నిర్ణయించింది.

    government-employees-no-longer-have-to-go-to-the-office-new-rules-in-ap
    government-employees-no-longer-have-to-go-to-the-office-new-rules-in-ap

    Chandrababu Naidu: సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే చంద్రబాబు

    సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే చంద్రబాబు, భవిష్యత్తులో ప్రపంచమంతా డిజిటల్ మయం కాబోతోందని బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే భౌతికంగా ఆఫీసులకు హాజరు కావాల్సిన అవసరం లేని విభాగాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలీ కాన్ఫరెన్స్‌ల ద్వారానే సమీక్షలు నిర్వహించాలని, ఫైళ్ల కదలికను ఆన్‌లైన్ చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రవాణా, విద్యుత్ ఖర్చులు తగ్గడమే కాకుండా.. ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని అంచనా.

    ప్రస్తుతానికి అన్ని శాఖల్లోనూ కాకుండా, ఎంపిక చేసిన విభాగాల్లో ఈ విధానాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టే అవకాశం ఉంది. మరికొన్ని శాఖల్లో హైబ్రిడ్ మోడల్ (వారంలో కొన్ని రోజులు ఆఫీస్, కొన్ని రోజులు ఇల్లు) అమలు చేసేలా మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలకు నేరుగా సేవలు అందించే విభాగాలు మినహా, మిగిలిన సెక్షన్ల ఉద్యోగులకు ఈ ఊరట లభించనుంది. త్వరలోనే జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా, ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగుల జీవనశైలిలో ఇది ఒక పెను మార్పుగా నిలవనుంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.