Srivari Mudupu: భక్తులు కోరిన కోరికలు తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం లక్షలాదిమంది భక్తులు తిరుమల చేరుకుంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి వారిని పూజిస్తే వారి కోరికలు తీరుస్తారని భావిస్తారు అందుకే భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారికి ముడుపు కట్టి కోరికలు కోరుకొని ఆ కోరిక నెరవేరిన అనంతరం తిరుమల చేరుకొని ఆ మడుపుల స్వామి వారి హుండీలో వేస్తూ ఉంటారు. అయితే చాలామంది స్వామివారికి ముడుపు కట్టే సమయంలో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. మరి స్వామి వారికి ముడుపు ఎలా కట్టాలి ముడుపు కట్టే సమయంలో చేయకూడని తప్పులు ఏంటి అనే విషయానికి వస్తే..
శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలి అనుకునేవారు శనివారం రోజున ఈ ముడుపు కట్టడం చాలా మంచిది. శనివారం ఉదయం నిద్ర లేచి తల స్నానం చేసి ఇంటిని అలాగే పూజగదిని శుభ్రం చేసుకోవాలి. స్వామివారి ముడుపు కట్టడం కోసం ఒక కొత్త తెల్లని వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రాన్ని పసుపు నీటిలో ముంచి బాగా ఆరనివ్వాలి. ఈ వస్త్రం ఆరిన తర్వాత నాలుగు మూలల కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. వస్త్రం పరిచి మధ్యలో 11 లేదా 21 లేదా 108 రూపాయల నాణేలు ఉంచాలి. ఇందులో 7యాలకులు, 7లవంగాలు,7ఎండు ఖర్జూరాలు ,కొద్దిగా పచ్చ కర్పూరం, జువ్వాడు, అక్షింతలు వేయాలి.

Srivari Mudupu: ముడుపు ఎవరికి చూపించకూడదు..
ఇక ఈ వస్తువులన్నీ వేసిన తర్వాత నా కోరిక నెరవేరాలి స్వామి అంటూ వస్త్రాన్ని మూట కట్టాలి. ప్రతి మూటకు మీ కోరికను చెప్పుకోవాలి. ఇలా ముడుపు కట్టిన తర్వాత ఆ వస్త్రం పై భాగంలో వెంకటేశ్వర స్వామి నామాలు బొట్టుగా పెత్తి ఆ వస్త్రాన్ని స్వామి వారి చిత్ర పటం ముందు ఉంచి తులసి దళాలలో అర్చన చేసి గోవింద నామాలు చదువుకోవాలి అనంతరం ముడుపుకు నైవేద్యం హారతులు ఇవ్వాలి. మీ కోరిక తీరిన తర్వాత ఈ ముడుపు తీసుకెళ్లి తిరుమలలోని స్వామివారి ఆలయంలోని హుండీలో వేయాలి. ముడుపు కట్టే సమయంలో, అలాగే ముడుపు బయటవారికి కనిపించకుండా జాగ్రత్త పడాలి.

