Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే టాలీవుడ్‌లో ఆ సందడి వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన ఒకే సమయంలో మూడు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద, సోషల్ మీడియాలో రచ్చ లేపడానికి సిద్ధమవుతుంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా? ప్రస్తుతం మహేష్ బాబు స్పీడ్ చూస్తుంటే అభిమానులకు ముందస్తుగానే పండగ వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఒకవైపు క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్‌తో బిజీగా ఉంటూనే, మరోవైపు రెండు ఆసక్తికరమైన చిత్రాలకు బ్యాక్ బోన్‌గా నిలబడుతూ టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు సూపర్ స్టార్.
ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘వారణాసి’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెట్స్‌పై మహేష్ కనిపిస్తే చాలు, ఆ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. ఈ భారీ చిత్రంలో మహేష్ లుక్, యాక్షన్ ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. అయితే కేవలం తన సినిమా షూటింగ్‌తోనే సరిపెట్టకుండా, మరో రెండు సినిమాల ప్రమోషన్ బాధ్యతలను కూడా మహేష్ తన భుజాలపై వేసుకోవడం విశేషం.

Tollywood: మహేష్ బాబు మూడు సినిమాల సందడితో ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్
ఘట్టమనేని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో వెండితెరకు పరిచయమవుతున్నారు. జూలై 9న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను జూలై మొదటి వారంలో గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై, తన అన్న కొడుకును వెండితెరకు పరిచయం చేయబోతున్నారు. బాబాయ్ సపోర్ట్ తో వస్తున్న ఈ వారసుడి ఎంట్రీ ఈవెంట్ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే, టాలెంటెడ్ హీరో సత్యదేవ్, డైరెక్టర్ వెంకటేష్ మహా కాంబినేషన్‌లో వస్తున్న ‘రావు బహదూర్’ చిత్రానికి మహేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. జూలై 3న విడుదల కానున్న ఈ సినిమాను ఇప్పటికే చూసిన మహేష్, సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించడంతో సినిమాపై బజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతేకాదు, సినిమా ప్రమోషన్స్ కోసం మహేష్ బాబు ఒకటి లేదా రెండు ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇవ్వబోతున్నట్లు టాక్. ఇలా ఒకే నెలలో షూటింగ్, ప్రీ-రిలీజ్ ఈవెంట్, ప్రమోషనల్ ఇంటర్వ్యూలతో మహేష్ బాబు మూడు సినిమాల సందడితో ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అందించబోతున్నారు.

