ఉమ్మడి విశాఖ జిల్లాలోనే కాకుండా, ఉత్తరాంధ్ర రాజకీయాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం భీమిలీ. ఒకప్పుడు కేవలం ప్రశాంతమైన బీచ్ ప్రాంతంగా ఉన్న భీమిలీ, ఇప్పుడు రూపురేఖలు మార్చుకుని ఐటీ హబ్‌గా, విలాసవంతమైన రిసార్టులు, గూగుల్ డేటా సెంటర్ వంటి గ్లోబల్ సంస్థలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ తరహాలో డెవలప్ అవుతున్న ఈ నియోజకవర్గంపై ఇప్పుడు అన్ని పార్టీల నేతల కన్ను పడింది. టీడీపీకి బలమైన కంచుకోటగా ఉన్న ఈ స్వీట్ సీట్ నుంచి పోటీ చేస్తే గెలుపు నల్లేరుపై నడకే అనే నమ్మకం ఉండటంతో, ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు భారీ పోటీ నెలకొంది.

Andhra Pradesh: భీమిలీ స్థానం నుంచి నందమూరి తేజస్విని బరిలోకి దించాలనే ఆలోచన
ఈ నేపథ్యంలోనే 2029 ఎన్నికల వ్యూహాల్లో భాగంగా భీమిలీ స్థానం నుంచి నందమూరి తేజస్విని బరిలోకి దించాలనే ఆలోచనలో కూటమి పెద్దలు ఉన్నట్లు గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె భర్త శ్రీ భరత్ విశాఖపట్నం ఎంపీగా భారీ మెజారిటీతో కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన ఎంపీగానే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో తన పార్లమెంట్ పరిధిలోనే ఉండే భీమిలీ అసెంబ్లీ స్థానం నుంచి భార్య తేజస్వినిని బరిలోకి దించితే, అటు నందమూరి ఇమేజ్, ఇటు లోకల్ గ్రిప్ రెండూ కలిసి వస్తాయని భరత్ భావిస్తున్నట్లు టాక్. ఇప్పటికే తెరవెనుక ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా మొదలైందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి.
అయితే భీమిలీ సీటు సాధించడం తేజస్వినికి అంత సులువు కాదనే చర్చ కూడా నడుస్తోంది. ఎందుకంటే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ వారసుడిని ఇక్కడి నుంచే లాంచ్ చేయాలని చూస్తున్నారు. మరోవైపు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ జనసేనలో చేరి భీమిలీ టికెట్ ఆశిస్తున్నారనే ప్రచారం ఉంది. వీటికి తోడు జనసేన పార్టీ కూడా ఈ సీటుపై గట్టి పట్టుదలతో ఉంది. ఇంతమంది సీనియర్లు, ఆశావహులు రేసులో ఉన్నప్పటికీ.. ఒకవేళ బాలయ్య కుమార్తెగా తేజస్విని గనుక రంగంలోకి దిగితే సమీకరణాలన్నీ తలకిందులు కావడం ఖాయం.
పైగా భీమిలీ నియోజకవర్గానికి నందమూరి కుటుంబానికి ఒక విచిత్రమైన సెంటిమెంట్ లింక్ ఉంది. గతంలో 1994 ఎన్నికల సమయంలో స్వయంగా అన్న నందమూరి తారకరామారావు ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించి, చివరి నిమిషంలో టెక్కలికి మారారు. ఆ తర్వాత 2019లో నారా లోకేష్ భీమిలీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. మరి అప్పట్లో తాత, బావలకు సాధ్యం కాని భీమిలీ ఎంట్రీని.. ఇప్పుడు బాలయ్య కుమార్తె తేజస్విని నిజం చేసి చూపిస్తారా? ఆమెకు అసలు రాజకీయాలపై ఆసక్తి ఉందా? లేదా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

