Wed. Jun 17th, 2026

    AP POLITICS: అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకోలా మారడం రాజకీయాల్లో సహజం. కానీ, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కీలక నియోజకవర్గమైన రేపల్లెలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే… ఇల్లు గడవకముందే ఇరుగుపొరుగు లొల్లి అన్న చందంగా తయారైంది. 2029లో ఎలాగైనా కూటమి మంత్రి అనగాని సత్యప్రసాద్ కోటకు బ్రేకులు వేయాలని వైసీపీ అధినేత జగన్ ఆశపడుతుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. పార్టీని బతికించుకోవాల్సిన నేతలు.. ఒకరినొకరు తొక్కుకుంటూ రేపల్లె వైసీపీని నడిరోడ్డుపై నిలబెడుతున్నారు.

    రేపల్లెలో క్యాడర్‌ను ఇబ్బంది పెడుతున్న ప్రధాన అంశం.. పార్టీలో ఇద్దరు పవర్‌ఫుల్ లీడర్లు తయారవ్వడం. నిన్నటివరకు నియోజకవర్గంలో ఒంటిచేత్తో పార్టీని నడిపించి, క్యాడర్‌లో జోష్ నింపిన పీటా నాగ మోహన కృష్ణ ఒకవైపు ఉంటే.. సడన్‌గా ఎంట్రీ ఇచ్చి సీన్ నాదే అంటున్న మోపిదేవి శ్రీనివాసరావు మరోవైపు ఉన్నారు. అధిష్టానం సోషల్ ఇంజనీరింగ్ లెక్కల ప్రకారం.. గౌడ, కాపు సామాజిక వర్గాలను కలిపి అనగానిపై ప్రయోగించాలనుకుంది. కానీ, ప్రాక్టికల్‌గా చూస్తే ఈ ఇద్దరు నేతల మధ్య కనీస కమ్యూనికేషన్ కూడా లేకపోవడం పార్టీ కొంప ముంచుతోంది.

    ap-politics-ycp-splits-in-two-in-repalle-a-new-headache-for-jagan
    ap-politics-ycp-splits-in-two-in-repalle-a-new-headache-for-jagan

    AP POLITICS: రేపల్లెలో వైసీపీ ఏ ప్రయోగం చేసినా అది బెడసికొడుతుందనే సెంటిమెంట్ 

    పార్టీలోకి రీ-ఎంట్రీ ఇచ్చిన మోపిదేవి.. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న పీటాను కలుపుకుని వెళ్లడం లేదు. నేను సీనియర్‌ని.. నా రేంజ్ వేరు అన్నట్లుగా ఆయన సొంతంగా క్యాంప్ ఆఫీస్ మెయింటైన్ చేస్తూ, విడిగా జనం వీధుల్లోకి వెళ్తున్నారు. జగన్ స్వయంగా తనకు హామీ ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో టికెట్ తనదేనని మోపిదేవి అనుచరులు నియోజకవర్గంలో ఓపెన్‌గా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు పీటా నాగ మోహన కృష్ణ వర్గానికి అస్సలు మింగుడు పడటం లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాము రోడ్లపైకి వచ్చి పోరాడితే, ఇప్పుడు రెడీమేడ్‌గా వచ్చి క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారంటూ పీటా క్యాడర్ గుర్రుగా ఉంది.

    సాధారణంగా రేపల్లెలో వైసీపీ ఏ ప్రయోగం చేసినా అది బెడసికొడుతుందనే సెంటిమెంట్ ఉంది. గతంలో మోపిదేవి వెంకటరమణ, ఈవూరి గణేష్ విషయంలోనూ ఇలాంటి గందరగోళాలే జరిగాయి. ఇప్పుడు మళ్లీ అదే తప్పు పునరావృతమవుతోంది. ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తే కూటమిని ఢీకొట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు, కానీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో సామాన్య కార్యకర్తలు ఎటు వెళ్లాలో తెలియక అయోమయంలో పడ్డారు.

    వైసీపీలో గ్రూపు తగాదాలు పీక్స్‌కి చేరడంతో, ఇది కాస్తా కూటమికి అయాచిత వరంగా మారేలా ఉంది. జగన్ గీసిన ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే ముందు ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న ఈగో వార్ ను సెటిల్ చేయాలి. లేదంటే 2029లో రేపల్లెలో వైసీపీకి మరోసారి హ్యాట్రిక్ పరాభవం తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ కొత్త తలనొప్పిని తాడేపల్లి బాస్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.