Politics: తెలంగాణ రాజకీయం ఒక సరికొత్త మలుపు తిరిగింది. నిన్నటివరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చుట్టూనే తిరిగిన రాజకీయం.. ఇప్పుడు ఒక్కసారిగా ఢిల్లీ వైపు మళ్లింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పొలిటికల్ రూట్ మార్చారు. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న గులాబీ దళాన్ని కాదని.. ఢిల్లీ పెద్దలపై, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఏకధాటిగా విమర్శనాస్త్రాలు సంధించడం వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం దాగి ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల తదుపరి పరిణామాల తర్వాత, బీజేపీ తన పూర్తి ఫోకస్‌ను దక్షిణాది రాష్ట్రాలపై, ముఖ్యంగా తెలంగాణపై పెట్టిందనేది బహిరంగ రహస్యం. గతేడాది పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన 8 సీట్ల మైలేజ్‌తో కమలనాథులు ఈసారి తెలంగాణను ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. కర్ణాటకలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో.. బీజేపీ అధిష్టానం చూపు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కేంద్రీకృతమైంది. ఈ సౌత్ మిషన్ ను పసిగట్టిన రేవంత్ రెడ్డి.. ముళ్లని ముల్లుతోనే తీయాలనే చందంగా తన రూట్ మార్చారు.

Politics: కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఇప్పుడు సూటిగా టార్గెట్ చేస్తున్నారు.
కేంద్రంలో వరుసగా పదేళ్లుగా మంత్రిగా ఉంటూ.. వివాదాలకు దూరంగా, కేవలం ఢిల్లీ-హైదరాబాద్ ప్రయాణాలకే పరిమితమయ్యే కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఇప్పుడు సూటిగా టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణలో పండిన 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని రేవంత్ ప్రశ్నిస్తున్నారు. కేవలం ధాన్యమే కాదు.. మెట్రో రైలు విస్తరణ, మూసీ నది సుందరీకరణ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్రం నుండి ఆశించిన సహకారం అందడం లేదని, దానికి కిషన్ రెడ్డి బాధ్యత వహించరా అంటూ నిలదీస్తున్నారు. చివరకు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రతో ముడిపడి ఉన్న తుమ్మడిహట్టి ప్రాజెక్టు విషయంలో దేవేంద్ర ఫడ్నవీస్‌తో మాట్లాడే చొరవ కూడా కిషన్ రెడ్డి చూపడం లేదంటూ రేవంత్ విమర్శలు గుప్పించడం వెనుక పెద్ద స్కెచ్చే ఉంది.
నిజానికి తెలంగాణలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కానీ, గత అసెంబ్లీ పోరులో కానీ బీజేపీ మూడో స్థానానికే పరిమితమైంది. అయితే, రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఉన్న పట్టును ముందే దెబ్బకొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక్కడే రేవంత్ రెడ్డి అసలు ప్లాన్ వర్కవుట్ అవుతోంది. తెలంగాణలో బీజేపీని ఎంతగా లైమ్‌లైట్‌లోకి తెస్తే.. అంతగా బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందనేది కాంగ్రెస్ లెక్క. రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే ట్రయాంగిల్ ఫైట్‌ను క్రియేట్ చేయడం ద్వారా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి, 2028 నాటికి కాంగ్రెస్‌కు రూట్ క్లియర్ అవుతుందనేది ఈ వ్యూహం అంతరార్థం. మొత్తానికి మోదీ ఫోకస్ ను అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డి మార్చిన ఈ పొలిటికల్ రూట్.. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త కాక రేపుతోంది.

