Sun. Jun 7th, 2026

    TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ ఒక్కసారిగా హీట్ పెంచింది. కూటమి తరఫున అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చాణక్యంగా వ్యూహాలు రచించి, ఎట్టకేలకు ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. పార్టీ తరఫున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లను బరిలోకి దించుతున్నట్లు టీడీపీ ప్రకటించగా, మిత్రపక్షం జనసేన కోటా కింద లింగమనేని రమేష్ పేరు ఖరారైంది. ఈ నలుగురు అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే, ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే అధికార పార్టీలో అంతర్గత ప్రకంపనలు మొదలయ్యాయి.

    రాజ్యసభ సీట్లు ఆశించి భంగపడిన సీనియర్ నేతల అసంతృప్తి జ్వాలలతో టీడీపీలో ఒక్కసారిగా వేడి రాజుకుంది. దశాబ్దాలుగా పార్టీ జెండా మోస్తూ, కష్టకాలంలోనూ అండగా నిలిచిన తమకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కలేదని కొందరు నేతలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. వర్ల రామయ్య, తిప్పేస్వామి, కంభంపాటి రామ్మోహన్ రావు, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి లాంటి గట్టి ఆశావహులు ఈ జాబితాలో ఉండటంతో పార్టీ వర్గాల్లో కలవరం మొదలైంది. తమకు అన్యాయం జరిగిందనే భావనలో ఉన్న ఈ నేతలు అలకపాన్పు ఎక్కడంతో, ఈ అసంతృప్తి మంటలు మరెటు దారితీస్తాయోనన్న ఆందోళన తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది.

    tdps-rajya-sabha-fire-initial-appeasement
    tdps-rajya-sabha-fire-initial-appeasement

    TDP PARTY: టీడీపీ అధిష్టానం తక్షణమే నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. 

    పరిస్థితి చేతులు దాటకముందే అప్రమత్తమైన టీడీపీ అధిష్టానం తక్షణమే నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కీలక నేత కిలారు రాజేష్ రంగంలోకి దిగి ట్రబుల్ షూటర్లుగా మారారు. అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలకు వరుసగా ఫోన్లు చేస్తూ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేయడం కోసమే ఈ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని నచ్చజెబుతున్నారు. భవిష్యత్తులో పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా తగిన గుర్తింపు, సముచిత స్థానం కల్పిస్తామని అధినేత తరఫున గట్టి భరోసా ఇస్తూ పెద్దలను శాంతింపజేసే పనిలో నిమగ్నమయ్యారు. మరి ఈ బుజ్జగింపుల పర్వంతో సీనియర్ల అలకలు ఎంతవరకు చల్లారుతాయో చూడాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.