Fri. May 29th, 2026
    Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘పవర్ సెంటర్’ అనగానే ఒకప్పుడు వైఎస్సార్ నీడ సూరీడు గుర్తుకొచ్చేవారు. సరిగ్గా అదే తరహాలో గత ఐదేళ్ల వైకాపా పాలనలో అంతకుమించిన పవర్‌తో తెరవెనుక కథ నడిపించిన వ్యక్తి కేఎన్ఆర్. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా, షాడో సీఎంలా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ మాజీ పీఏ చుట్టూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం గట్టి ఉచ్చు బిగిస్తోంది. ఏసీబీ జరుపుతున్న రహస్య విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆస్తుల వివరాలు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో పెను సంచలనంగా మారాయి.

    అధికారం చేతిలో ఉంటే సామాన్యులు కూడా ఎలా కుబేరులైపోతారో చెప్పడానికి కేఎన్ఆర్ ఎదుగుదలే ఒక ఉదాహరణగా మారుతోంది. గతంలో నెలకు కేవలం రూ. 12 వేల జీతంతో సాక్షి సంస్థలో పనిచేస్తూ, చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకున్న ఒక సాధారణ కుటుంబం.. ఐదేళ్లు తిరిగేసరికి వందల కోట్ల సామ్రాజ్యానికి అధిపతులుగా మారడం వెనుక ఉన్న మాయాజాలం ఏంటనే కోణంలో ఏసీబీ ఆరా తీస్తోంది. కేవలం కడప జిల్లాలోనే కాకుండా హైదరాబాద్, వైజాగ్, అమరావతి లాంటి ప్రైమ్ లొకేషన్లలో లగ్జరీ విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, బినామీల పేరిట సాగిన వ్యాపారాల నెట్‌వర్క్‌ను అధికారులు స్కానింగ్ చేస్తున్నారు. ఐదేళ్ల పాటు సచివాలయం నుండి తాడేపల్లి ప్యాలెస్ దాకా.. ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు, లిక్కర్ డీల్స్, మైనింగ్ లీజుల వ్యవహారాల్లో కేఎన్ఆర్ చెప్పిందే వేదంగా సాగిందనే టాక్ కూడా ఉంది.

    andhra-pradesh-acb-hunt-a-trap-being-tightened-around-jagans-pa
    andhra-pradesh-acb-hunt-a-trap-being-tightened-around-jagans-pa

    Andhra Pradesh: 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైకాపా 11 సీట్లకు పడిపోవడంతో

    అయితే, ఈ వ్యవహారంలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధానాంశం జగన్ రెడ్డి వైఖరి. పీఏ స్థానంలో ఉన్న వ్యక్తి తన పేరు వాడుకుని ఇంత పెద్ద ఎత్తున వెనకేసుకుంటుంటే జగన్‌కు తెలీదా? లేక ఇదంతా అధినేత కనుసన్నల్లోనే సాగిన బినామీ హవానా? అనే చర్చ నడుస్తోంది. ఒకవేళ కేఎన్ఆర్ స్వయంకృతాపరాధమే అయితే ఆయనకు వైకాపా నుండి ఎలాంటి మద్దతు దక్కే అవకాశం లేదు. ఒకవేళ ఇందులో పెద్దల హస్తం ఉంటే మాత్రం ఆయనను కాపాడటానికి తెరవెనుక ప్రయత్నాలు జరగక తప్పదు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైకాపా 11 సీట్లకు పడిపోవడంతో రాజకీయ అండ పూర్తిగా బలహీనపడింది. ఈ తరుణంలో ఏసీబీ గనుక పూర్తి ఆధారాలతో చట్టపరమైన చర్యలకు దిగితే, కేఎన్ఆర్ జైలు పాలు కావడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ రహస్యాలను బద్దలు కొట్టే ఈ ఏసీబీ వేట ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.