Mon. May 25th, 2026

    Telangana Politics: తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా ఒక ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. నిన్నటివరకు ఏ పార్టీని ఐతే తెలంగాణ సెంటిమెంట్‌తో కార్నర్ చేశారో, ఏ నాయకుడిని ఐతే తీవ్రంగా విమర్శించారో.. ఇప్పుడు అదే పార్టీని, అదే నాయకత్వాన్ని ఉదాహరణగా చూపిస్తూ గులాబీ దళపతి కేటీఆర్ మాట్లాడటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రెండున్నర దశాబ్దాల పాటు నిలబడిన పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, బీఆర్‌ఎస్ మాత్రమేనంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీశాయి. అసలు ఈ ‘టీడీపీ’ జపం వెనుక కేటీఆర్ భయం ఉందా? లేక దీని వెనుక ఏదైనా బలమైన రాజకీయ వ్యూహం దాగి ఉందా?

    ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీ ఒక క్లిష్టమైన దశను ఎదుర్కొంటోంది. ఒకవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దూకుడు ప్రదర్శిస్తోంది. మరోవైపు ఢిల్లీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో జెండా పాతిన ఉత్సాహంతో బీజేపీ.. తెలంగాణే తమ తదుపరి లక్ష్యమని బాహాటంగానే ప్రకటిస్తోంది. ఇలాంటి డబుల్ ఎటాక్ మధ్య, ఢిల్లీ లిక్కర్ స్కామ్ పరిణామాలు పార్టీ శ్రేణులను మరింత ఆందోళనలోకి నెట్టాయి. ఈ క్రమంలోనే విపక్షాల ‘ఆపరేషన్ ఆకర్ష్’ తెరపైకి రావడం, ముఖ్య నేతలు గోడ దూకడానికి సిద్ధపడుతున్నారనే ప్రచారం బీఆర్‌ఎస్ పునాదులను కదిలిస్తోంది. అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడంతో, తమ్ముళ్లలో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చూసే బాధ్యత ఇప్పుడు కేటీఆర్ భుజాలపై పడింది.

    telangana-politics-ktrs-tdp-chant-fear-strategy
    telangana-politics-ktrs-tdp-chant-fear-strategy

    Telangana Politics: కేటీఆర్ పొదునైన వ్యూహాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. 

    పార్టీ క్యాడర్ చేజారిపోకుండా, వారు పక్క చూపులు చూడకుండా ఆపడానికే కేటీఆర్ పొదునైన వ్యూహాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. నాడు ఎన్టీఆర్‌కు ఉన్న ఇమేజ్, గ్లామర్ కేసీఆర్‌కు లేకపోయినా, ఒంటరిగా పోరాడి తెలంగాణ సాధించారనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. 25 ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడిన చరిత్ర తమదని.. తెలుగు రాష్ట్రాలలో టీడీపి, బీఆర్ఎస్‌ పార్టీలు మాత్రమే రెండున్న‌ర ద‌శ‌బ్దాల‌కు పైగా నిలబడ్డాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు ఇలాంటి చారిత్రాత్మక పోలికలు అవసరమే అయినప్పటికీ.. టీడీపీతో పోల్చుకోవడంపైనే ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట నిజమే కానీ, బీఆర్‌ఎస్ విషయంలో ఇది మరీ విచిత్రంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. నాడు ఏపీలో చంద్రబాబును గద్దె దించడానికి జగన్‌తో చేతులు కలపడం దగ్గర నుంచి, బాబు అరెస్ట్ అయినప్పుడు సైలెంట్‌గా ఉండటం వరకు గులాబీ బాసులు వ్యవహరించిన తీరు అందరికీ గుర్తుంది. ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చేందుకు చంద్రబాబు పేరును, ఆంధ్రా పాలకుల దోపిడీని అస్త్రంగా వాడుకున్న బీఆర్‌ఎస్.. ఇప్పుడు అదే టీడీపీని తమకు రోల్ మోడల్‌గా చూపించడం రాజకీయ హాస్యాస్పదమనే వాదనలు వినిపిస్తున్నాయి.

    చంద్రబాబు నాయకత్వాన్ని తక్కువ చేసి మాట్లాడిన గతాన్ని మర్చిపోయి, ఇప్పుడు మనుగడ కోసం అదే పార్టీతో సమానత్వాన్ని కోరుకోవడం కేటీఆర్ రక్షణాత్మక ధోరణికి అద్దం పడుతోంది. ఏది ఏమైనా, వలసల భయాన్ని పోగొట్టుకోవడానికి కేటీఆర్ ఎంచుకున్న ఈ టీడీపీ మంత్రం గులాబీ శ్రేణుల్లో ఎంతవరకు జోష్ నింపుతుందో చూడాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.