Politics: ఏపీలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్న జనసేన అధినేత పవన్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీని లక్ష్యంగా చేసుకొని వారిని గద్దె దించడమే అజెండాగా పవన్ కళ్యాణ్ తన రాజకీయ వ్యూహాలు కొనసాగిస్తున్నారు. అలాగే కార్యాచరణ కూడా సిద్ధం చేసుకొని ముందుకి వెళ్తున్నారు. రాబోయే కొత్త సంవత్సరంలో వీలైనంత ఎక్కువగా ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలపై వారితో మమేకం అవుతూ వైసీపీ వైఫ్యల్యాలని ఎండగడుతూ ముందడుగు వేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇక తన రాజకీయ యాత్రకి గాను ఇప్పటికే వారాహి రథాన్ని సిద్ధం చేసుకున్నారు. అలాగే తన వెంట నడిచేందుకు ఒక వాహన శ్రేణిని కూడా జనసేనాని సిద్ధం చేశారు. ఇప్పటికే వాటి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయ్యింది. ఇక కొత్త ఏడాదిలో జనవరి నుంచి తన రాజకీయ వ్యూహరచనతో పవన్ కళ్యాణ్ ఏపీలో ప్రయాణం మొదలు పెట్టబోతున్నాడు.
ఇక శ్రీకాకుళం నుంచి యువశక్తి అనే కొత్త కార్యాక్రామానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ కార్యక్రమంలో యువతని, విద్యార్ధులు, నిరుద్యోగులని వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసింది. జాబ్ క్యాలెండర్ పేరుతో అబద్దపు హామీలు ఇచ్చి తప్పుదోవ పట్టించిన విధానాన్ని తెలియజేయనున్నారు. అలాగే జనసేన అధికారంలోకి వస్తే యువత కోసం తాము ఎలాంటి కార్యాచరణతో ముందుకి వెళ్తాం అనేది కూడా చెప్పే అవకాశం ఉంది. ఇక రానున్న ఏడాదిన్నర కాలంలో పవన్ కళ్యాణ్ నాలుగు అంశాలని అజెండాగా తీసుకొని వైసీపీ సర్కార్ పై పొలిటికల్ వార్ ప్రకటించడంతో పాటు ప్రజలకి చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. వాటిలో ఇప్పటికే జనవాణి అనే కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి సమస్యలని అడిగి తెలుసుకుంటున్నారు. తమ దృష్టికి వచ్చిన అన్ని సమస్యలని రికార్డ్ చేసే బాద్యతని టీమ్ కి అప్పగించారు.
అలాగే కౌలు రైతు భరోసా యాత్ర ద్వారా చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకి లక్ష రూపాయిల చొప్పున ఆర్ధిక సాయం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఇంకా కొనసాగనుంది. ఇప్పుడు జనవరిలో యువశక్తి కార్యక్రమం ద్వారా యువతరంకి చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని తర్వాత వారాహితో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ యాత్ర చేయబోతున్నాడు. ఈ యాత్రలో ప్రజా సమస్యలని ప్రస్తావించడంతో పాటు వైసీపీ వైఫల్యాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ఈ బస్సుయాత్రలో భాగంగానే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధుల కోసం అన్ని నియోజకవర్గాలకి బలమైన నాయకులని సిద్ధం చేయబోతున్నారు.
ముఖ్యంగా వైసీపీ నుంచి ఎక్కువ మంది జనసేనలో చేరడానికి రెడీగా ఉన్నారనే మాట వినిపిస్తుంది. ఎవరు పార్టీలో చేరిన కచ్చితంగా వారి ద్వారా పార్టీకి ఎన్నికల ముందు ప్రజారాజ్యం తరహాలో నష్టం జరగకుండా చాలా జాగ్రత్తగా వెళ్లాలని అనుకుంటున్నారు. పార్టీలోకి వచ్చి ఎన్నికల ముందు టికెట్లు రాలేదని, ఎన్నికల తర్వాత గెలిచి పార్టీ జంప్ అవ్వకుండా ఉన్నవారికి టికెట్లు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇలా నాలుగు అంశాలని ప్రధాన అజెండాగా పెట్టుకొని, నాలుగు అంచెల వ్యూహంతో పవన్ రాజకీయ ప్రయాణం చేయబోతున్నారు.