Fri. Nov 20th, 2026

    మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్)
    నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా, చైతూ జొన్నలగడ్డ, ఇంద్రన్స్ తదితరులు
    సంగీతం: సాయి అభ్యంకర్
    సినిమాటోగ్రఫీ: K ఎళిల్ అరసు
    ఎడిటింగ్: కళైవనన్
    నిర్మాతలు: శ్రద్ధా అగర్వాల్, ధనుష్, అజ్మత్ జగ్మగ్
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్‌కుమార్ పెరియసామి

    Kollywood: ఒక్క ఫ్రేమ్‌లో ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి కనిపిస్తారంటే ఏ ప్రేక్షకుడికైనా ఆశలు ఆకాశాన్ని తాకుతాయి. ‘అమరన్’తో మనసులు గెలిచిన రాజ్‌కుమార్ పెరియసామి ఈ మూడు శక్తులను కలిపి ఎర్రచందనం అడవుల్లోకి దిగారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ద్వారా నాగవంశీ తెలుగులో విడుదల చేసిన ఈ చిత్రం, ఆ భారీ అంచనాలను అందుకుందా? చూద్దాం.

    కథ:

    తమిళనాడు–ఆంధ్ర సరిహద్దుల్లోని అడవుల్లో ఎర్రచందనం మాఫియా రాజ్యం ఏలుతోంది. ఆ మాఫియాకు తండ్రిని, భర్తను బలిచ్చుకున్న పోలీస్ అధికారిణి నిత్యారెడ్డి (సాయి పల్లవి), వారిని అంతమొందించాలన్న కసితో రగిలిపోతూ ఉంటుంది. అదే సమయంలో మాఫియా అధినేత కార్తికేయన్ (మమ్ముట్టి) శిబిరంలోకి ఫోటోగ్రాఫర్ ముసుగులో ఒక రహస్య పోలీస్ అధికారి తిరుకుమరన్ (ధనుష్) అడుగుపెడతాడు. నమ్మకాన్ని గెలుచుకుని కార్తికేయన్‌కు కుడిభుజంగా మారిన అతని ముందు ఒక పరీక్ష నిలుస్తుంది. వెయ్యి టన్నుల సరుకుతో ఈ దందాకు ముగింపు పలకాలనుకున్న కార్తికేయన్ ప్లాన్ ఒకవైపు, నిత్యారెడ్డి వేసే వలలు మరోవైపు. ఈ రెండు పాటల మధ్య తిరుకుమరన్ ఎవరి పక్షం నిలిచాడు? అతని అసలు రూపం బయటపడిందా? ఈ మాఫియా వెనుక ఉన్న అసలు తలకాయలు చట్టానికి చిక్కాయా? ఈ కథలో కడప గోవర్ధన్ రెడ్డి(బ్రహ్మాజీ), షణ్ముగం(ఇంద్రాన్స్), హమీద్ (నసీరుద్దీన్ షా) పాత్రలు ఏమిటి? అవన్నీ తెరపైనే చూడాలి.

    kollywood-om-review-did-the-dhanush-and-sai-pallavi-movie-impress
    kollywood-om-review-did-the-dhanush-and-sai-pallavi-movie-impress

    ఎలా ఉందంటే:

    స్పై థ్రిల్లర్ అంటే పరుగులు పెట్టే కథనం, మలుపుల మీద మలుపులు అనుకుంటాం. కానీ రాజ్‌కుమార్ ఈ సినిమాను అలా తీయలేదు. ఇక్కడ తుపాకీ కంటే మనిషి మనసుకే ఎక్కువ చోటు. అడవిని నమ్ముకున్న గిరిజనులు స్మగ్లర్ల చేతిలో రోజువారీ కూలీలుగా మారిన తీరును మొదటి నిమిషాల్లోనే గుండెకు తగిలేలా చూపించారు. ఇక్కడే సినిమా తన నిజాయితీని చాటుకుంటుంది. ప్రథమార్థం ఆసక్తిగా సాగుతుంది. పాత్రల పరిచయం, అండర్ కవర్ ఆపరేషన్ మొదలయ్యే విధానం కథలోకి లాగేస్తాయి. హీరోయిజం కోసం బలవంతపు ఎలివేషన్లు లేవు. కథకు ఎంత కావాలో అంతే. ఇంటర్వెల్ ట్విస్టుల కంటే భావోద్వేగాల మీద నిలబడటం ఈ సినిమాలో బాగా పండిన అంశం.

    అసలు సమస్య ద్వితీయార్థంలో మొదలవుతుంది. కథ వేగం తగ్గి, సన్నివేశాలు చెప్పాల్సిన విషయాన్ని సంభాషణలు చెప్పడం మొదలవుతుంది. థ్రిల్లర్‌కు ప్రాణమైన ఉత్కంఠ పలుచబడి, మలుపులు ముందే ఊహించేలా మారతాయి. క్లైమాక్స్ సాగదీతగా అనిపించి, ముగింపు మాత్రం హఠాత్తుగా ముగిసినట్టు ఉంటుంది. విస్తరాకులో వడ్డించిన భోజనాన్ని సగంలోనే లాగేసినట్టు.

    ఎవరెలా చేశారు?:

    సాయి పల్లవి ఈ సినిమాకు గుండెకాయ. కరకు పోలీస్ ఆఫీసర్‌గా ఆమె చూపిన తీవ్రత, ఇప్పటివరకు చూడని కొత్త కోణం. కళ్లలో కసి, మాటల్లో పదును బాగా పండాయి. ధనుష్ అతి లేకుండా సహజంగా నటించారు. ద్వంద్వంలో నలిగిపోయే పాత్ర మనసులోని సంఘర్షణను ఎక్కువగా కళ్లతోనే పలికించారు. మమ్ముట్టి తన గంభీరమైన ఉనికితోనే ప్రాణం పోశారు. అయితే ఆయన స్థాయికి తగ్గ బలమైన స్కోప్ కథలో దక్కలేదు. ధనుష్ తండ్రి పాత్రలో ఇంద్రన్స్ కళ్లు తడిపిస్తారు. ఇంటర్వెల్ ఎమోషన్‌కు ఆయనే వెన్నెముక. శ్రీలీల కొద్ది సేపే కనిపించినా పరవాలేదనిపిస్తారు. నసీరుద్దీన్ షా లాంటి దిగ్గజాన్ని సరిగ్గా వాడుకోకపోవడం పెద్ద వెలితి. మిగిలిన వారంతా తమ పరిధిలో బాగానే చేశారు.

    సాంకేతిక నిపుణుల పనితీరు:

    సాయి అభ్యంకర్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు పెద్ద ఆసరా. కథనం నెమ్మదించిన చోట కూడా అతని సంగీతం ఉత్కంఠను నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఎళిల్ అరసు కెమెరా ఎర్రచందనం అడవుల కఠిన వాతావరణాన్ని సహజంగా పట్టుకుంది. మొదట్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ రా అండ్ రస్టిక్‌గా ఉండి సినిమా మూడ్‌ను సెట్ చేస్తుంది. కళైవనన్ ఎడిటింగ్ మొదటి సగంలో బాగున్నా, రెండో సగంలో కత్తెర వేయడంలో వెనకడుగు వేశారు. దర్శకుడి పాయింట్, పరిశోధన బాగున్నాయి. కానీ ద్వితీయార్థ స్క్రీన్‌ప్లేపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా స్థాయే వేరుగా ఉండేది.

    బలాలు:

    సాయి పల్లవి, ధనుష్ నటన
    సాయి అభ్యంకర్ నేపథ్య సంగీతం
    వాస్తవికంగా అనిపించే కథనం, గిరిజనుల వేదన
    ఇంటర్వెల్ ఎమోషన్
    అడవి నేపథ్యాన్ని పట్టుకున్న సినిమాటోగ్రఫీ

    బలహీనతలు:

    నెమ్మదించిన ద్వితీయార్థం
    సంభాషణలతో వివరించే కథనం
    సాగదీసిన క్లైమాక్స్, హఠాత్తు ముగింపు
    ఊహించగలిగే మలుపులు

    చివరగా..

    ఇది వేగం కోసం చూసే కమర్షియల్ యాక్షన్ సినిమా కాదు. నెమ్మదిగా సాగే, భావోద్వేగాలతో నిండిన డ్రామాలను ఇష్టపడేవారు థియేటర్‌లో ఒకసారి చూడొచ్చు.

    రేటింగ్: 2.75/5

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.