Politics: ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలంటే ఏకంగా175 స్థానాలలో మనమే గెలుపొందాలని క్యాడర్ కి పిలుపునిస్తుంది. టార్గెట్ 175 అంటూ ఎన్నికల బరిలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతుంది. వైఎస్ జగన్ కూడా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ కుప్పంలో గెలిచాం కాబట్టి అన్ని నియోజకవర్గాలలో కూడా గెలుస్తాం అంటూ కాస్తా అతిగానే చెబుతున్నారు. 175 సీట్లలో గెలిచే ఛాన్స్ మనం చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు మనకి ఇస్తారని చెబుతున్నారు. సంక్షేమ పథకాలే ప్రజలలో మనకి ఉన్న ఓటుబ్యాంకు అంటూ క్లారిటీ ఇస్తున్నారు. ఇదే సందర్భంగా మరో ఛాన్స్ అనే నినాదంతో ప్రజలకి చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే ఎమ్మెల్యేలని గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా పంపించే ప్రజలకి దగ్గర కమ్మని చెబుతున్నారు. గెలుపు గుర్రాలకే ఈ సారి టికెట్స్ ఉంటాయని కరాఖండీగా చెప్పేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగు దేశం పార్టీ కూడా ప్రజలలోకి విస్తృతంగా వెళ్తుంది. ఓ వైపు తెలుగు దేశం అధినేత చంద్రబాబు జిల్లాల వారీగా పర్యటనలు నిర్వహిస్తూ ప్రజా మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో విప్పు లోకేష్ జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ప్రభుత్వ వ్యతిరేకత, అలాగే టీడీపీకి ఉన్న బలమైన ఓటుబ్యాంకు మళ్ళీ తమని అధికారంలోకి తీసుకొస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందులో భాగంగా తనకి ఇదే చివరి ఎన్నిక అని, చివరి సారిగా తనని గెలిపించి గౌరవంగా ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీకి పంపించాలని ప్రజలని కోరుతున్నారు.
చివరి అవకాశం ఇవ్వండి అనే నినాదంతో ప్రజలకి చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సానుభూతి ఓటింగ్ పెంచుకోవడాలనే ఉద్దేశ్యంతో అసెంబ్లీలో తన భార్యని వైసీపీ నేతలు అవమానించారు అంటూ చెబుతున్నారు. ఇదిలా ఉంటే మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సారి చాలా అగ్రెసివ్ గా రాజకీయాలు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజా మద్దతు పెంచుకొనే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. బలమైన క్యాడర్ లేకపోవడం జనసేన పార్టీకి మైనస్ అయినా కూడా బలమైన సామాజిక వర్గం, అలాగే అభిమానగణం తనకి అండగా ఉంటుందనే నమ్మకం జనసేనానిలో ఉంది.
ఈ నేపధ్యంలో ప్రధాని మోడీని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ తెరపైకి కొత్త నినాదంతో వచ్చారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అభివృద్ధి, సంక్షేమం కలిసిన పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అంటున్నారు. గతంలో ముఖ్యమంత్రి కావాలనే ఆశని వ్యక్తం చేయకున్నా ఈ సారి అధికారంలోకి వచ్చేది జనసేననే అని గట్టిగా కార్యకర్తలకి దిశానిర్ధేశ్యం చేయడంతో పాటు బలంగా తమ స్వరాన్ని వినిపించాలని ప్రజలలోకి వెళ్లాలని నాయకులకి పిలుపునిచ్చారు. అదే సమయంలో ఒక ఛాన్స్ అనే నినాదంతో ప్రజలకి చేరువ అవ్వాలని అనుకుంటున్నారు. గత ఎన్నికలలో జగన్ ని ఆ ఒక ఛాన్స్ నినాదమే అధికారంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు జనసేన ఆ నినాదాన్ని అందుకుంది. ఇలా మూడు పార్టీలు మూడు నినాదాలతో ఈ సారి ప్రజలలోకి వెళ్తున్న నేపధ్యంలో ఏపీ ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.