Bollywood: గత రెండేళ్ళ నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పెద్ద హీరోల నుంచి వచ్చిన సినిమాలు ఏవీ కూడా థియేటర్స్ లో నిలబడటం లేదు. ఫ్లాప్ టాక్ నే తెచ్చుకుంటున్నాయి. వందల కోట్ల రూపాయిల బడ్జెట్ పెట్టి తీస్తున్న సినిమాలు అందులో సగం కూడా కలెక్షన్స్ చేయడం లేదు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ కి గ్రహణం పట్టిందని చెప్పాలి. ముఖ్యంగా సుశాంత్ సింగ్ మరణానికి బాలీవుడ్ లో నెపోటిజం కారణం అని బలంగా నమ్మిన వారందరూ కూడా ఆ కుటుంబాల నుంచి వచ్చే సినిమాలని వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే బ్యాన్ బాలీవుడ్ అనే హ్యాష్ ట్యాగ్ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆరంభంలో ఈ బ్యాన్ బాలీవుడ్ అనే నెగిటివ్ ప్రచారాన్ని బాలీవుడ్ సెలబ్రిటీలు పెద్దగా పట్టించుకోలేదు. అలాంటి నెగిటివ్ ప్రచారాలు ప్రతిసారి జరుగుతూనే ఉంటాయని కొట్టిపారేశారు. సినిమాలో కంటెంట్ నచ్చితే ఆడియన్స్ థియేటర్స్ కి ఆటోమేటిక్ గా వస్తారని బలంగా నమ్మారు. ఇక బాలీవుడ్ లో ఎక్కువగా సెక్యులర్ భావజాలం ముసుగులో హిందుత్వంపై, హిందూ ఆచారాలు, విశ్వాసాలని కించపరిచే విధంగా సినిమాలు చేస్తున్నారని కూడా హిందుత్వ వాదులు అందరూ కూడా నమ్మడం మొదలు పెట్టారు. నార్త్ ఇండియాలో హిందుత్వ భావజాలం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఆ భావజాలాన్ని బలంగా నమ్మేవారు అందరూ కూడా బాలీవుడ్ సినిమాలని ద్వేషించడం మొదలు పెట్టారు.
అదే సమయంలో సౌత్ సినిమాల ఆధిపత్యం మొదలైంది. టాలీవుడ్ లో బాహుబలి సిరీస్, కేజీఎఫ్ సిరీస్, ఆర్ఆర్ఆర్, పుష్ప, కార్తికేయ, కాంతారా లాంటి సినిమాలు భాగా ప్రభావితం చేశాయి. ఈ నేపధ్యంలో సౌత్ దర్శకులు ఇండియన్ నేటివిటీలో కథలు చెబుతూ మన మూలాలని బలంగా చూపించే ప్రయత్నం చేస్తారనే నమ్మకం నార్త్ ఇండియన్ ఆడియన్స్ లోకి వెళ్ళిపోయింది. బాలీవుడ్ సినిమాలు అన్ని కూడా పాశ్చాత్య పోకడలతో ఉంటాయని, వారు వేసుకునే కాస్ట్యూమ్స్ నుంచి సినిమా కంటెంట్ వరకు ఇందులో కూడా ఇండియన్ నేటివిటీ కనిపించదని విమర్శలు వెళ్ళాయి. ఈ నేపధ్యంలో బాలీవుడ్ నీడ పడకుండా తెరకెక్కిన మణికర్ణిక, ది కాశ్మీర్ ఫైల్, బ్రహ్మాస్త్ర లాంటి సినిమాలు కాస్తా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే ఇవి బాలీవుడ్ లో జరిగిన నష్టాన్ని పూడ్చలేకపోయానని చెప్పాలి.
ఈ నేపధ్యంలో బాలీవుడ్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీగా షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత చేస్తున్న పఠాన్ మూవీపై అందరూ నమ్మకం పెట్టుకున్నారు. ఈ సినిమాతో మళ్ళీ బాలీవుడ్ ఇండస్ట్రీకి పాత రోజులు వస్తాయని నమ్మారు. అయితే పఠాన్ మూవీపై కూడా నెగిటివ్ ప్రచారం నడిచింది. రిలీజ్ రోజు కూడా హిందుత్వ సంఘాలు పఠాన్ సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అన్ని చేసిన కూడా మొదటి రోజు ఏకంగా 55 కోట్ల నెట్ ని ఈ మూవీ రాబట్టింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిత్రంగా పఠాన్ ఇప్పుడు నిలిచింది. ఇక రెండో రోజు కూడా కలెక్షన్స్ 50 కోట్లు దాటుతాయనీ అంచనా వేస్తున్నారు. సినిమాకి కూడా పాజిటివ్ టాక్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇండియన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా కావడంతో దేశభక్తిని సినిమాలో టచ్ చేయడంతో నార్త్ లో కూడా ప్రేక్షకులకి రీచ్ అయ్యింది. మరి లాంగ్ రన్ లో ఈ మూవీ ఏ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.